రియాద్: లక్షలాది వలస కార్మికుల జీవితాలను దశాబ్దాలుగా నరకప్రాయం చేసిన వివాదాస్పద కఫాలా (Kafala) వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది. ఈ ఏడాది జూన్‌లో దీనిపై ప్రకటన వెలువడినప్పటికీ, తాజాగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వలసదారుల హక్కులు, సంక్షేమంలో ఇది ఒక చారిత్రక ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ‘విజన్ 2030’ సంస్కరణలలో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేయాలని ప్రణాళికలు ప్రకటించింది – ముఖ్యంగా 2029 ఆసియా వింటర్ గేమ్స్‌తో సహా ప్రపంచ ఈవెంట్‌లకు ముందు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా తమ దేశ ఇమేజ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కఫాలా వ్యవస్థను రద్దు చేయడంతో దాదాపు 13 మిలియన్ల విదేశీ కార్మికులు, ముఖ్యంగా 2.5 మిలియన్ల మంది భారతీయులు ప్రయోజనం పొందుతారు.
ఏమిటీ కఫాలా వ్యవస్థ?
1950వ దశకంలో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి భారత్, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి కార్మికులను రప్పించేందుకు కఫాలా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం… ప్రతి విదేశీ కార్మికుడికి ఒక ‘కఫీల్’ లేదా ‘స్పాన్సర్’ ఉంటారు. వీరు ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక కంపెనీ కావచ్చు. కార్మికుడి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడం, వారి జీతాలను నిలిపివేయడం, వారు ఎప్పుడు ఉద్యోగం మారాలి, ఎప్పుడు దేశం విడిచి వెళ్లాలో నిర్ణయించడం వంటి అమానవీయ అధికారాలు ఈ స్పాన్సర్లకు ఉండేవి. కనీసం తమపై జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేయాలన్నా స్పాన్సర్ అనుమతి తీసుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది.
ఈ విధానం కార్మికుల హక్కులను కాలరాయడమే కాకుండా, వారిని వెట్టిచాకిరీలోకి నెడుతోందని కార్మిక, మానవ హక్కుల సంఘాలు ఏళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే నైపుణ్యం కలిగిన లేదా వైట్-కాలర్ కార్మికులకు ఈ వ్యవస్థ అంత చెడ్డది కాదు.
కఫాలా వ్యవస్థ ప్రమాదాలు
కఫాలా వ్యవస్థను అనుసరిస్తున్న గల్ఫ్ దేశాలు ‘స్పాన్సర్‌షిప్’ ముసుగులో మానవ అక్రమ రవాణాను అనుమతిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇతర ప్రపంచ సంస్థలు ఆరోపించాయి. తద్వారా మహిళలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. హక్కుల సంఘాలు కఫీల్ లైంగిక వేధింపులకు పాల్పడిన సందర్భాలను నమోదు చేశాయి. ఉదాహరణకు, 2017లో, గుజరాత్‌లోని ఒక మహిళను సౌదీ అరేబియాలో ఆమె ‘స్పాన్సర్’ బలవంతంగా లైంగిక బానిసత్వంలోకి నెట్టడంతో, భారత ప్రభుత్వం ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చింది.
అదే సంవత్సరం నెలకు రూ. 1.5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి సౌదీకి తీసుకెళ్లిన కర్ణాటకకు చెందిన ఒక మహిళను శారీరకంగా వేధించి, దమ్మామ్ నగరంలోని ఒక భవనం మూడవ అంతస్తు నుండి విసిరేశారు. ఆమెను కాపాడటానికి ప్రభుత్వం మళ్ళీ జోక్యం చేసుకోవలసి వచ్చింది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ హక్కుల సంఘాల నివేదికల ప్రకారం…ఇలాంటి బాధితులు భారత్, నేపాల్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇథియోపియా వంటి దేశాలకు చెందిన వేలాది మంది ఉన్నారు.
మరి సౌదీ ఎందుకు రద్దు చేసింది?
సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి. స్వచ్ఛంద, సహాయ సంస్థల నివేదికలు, కీలకమైన విదేశీ పెట్టుబడుదారుల అసంతృప్తి ప్రభావితం చేశాయి. కానీ, చివరికి ఇది యువరాజు తీసుకున్న నిర్ణయం. దీని వెనుక సౌదీ అరేబియా ప్రపంచ స్థాయి ఆశయాలే ప్రధాన కారణం.


