హైదరాబాద్: లైఫ్ సైన్సెస్‌లో 2030 నాటికి కొత్తగా లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి అన్నారు.
ఆస్ బయోటెక్, విక్టోరియా ప్రభుత్వం సంయుక్తంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఆస్ బయోటెక్ అంతర్జాతీయ సమావేశంలో మంత్రి కీలకోపన్యాసం చేశారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన “రోడ్‌మ్యాప్ 2030”ను రూపొందించిందని ఇక్కడ అధికారిక ప్రకటన తెలిపింది.
ఈ సందర్భంగా లైఫ్ సైన్సెన్, ఉన్నతవిద్య, పరిశోధన రంగాల్లో పెట్టుబడుల కోసం రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఆయన వివరించారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీ హబ్, ఫ్యూచర్ సిటీ, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ వంటి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
20 నెలల కాలంలో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’’ని అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11, జనాభాలో 12వ స్థానాల్లో ఉన్నప్పటికీ, జీడీపీలో ఐదు శాతం కంటే ఎక్కువ వాటా ఉందని మంత్రి తెలిపారు. 2024–25లో తెలంగాణ GSDP వృద్ధి రేటు 8.2 శాతంగా ఉందని, జాతీయ సగటు 7.6 శాతంతో పోలిస్తే ఇది జరిగిందని ఆయన అన్నారు.
బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌కేర్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అవసరాలను తీర్చడానికి “రెడీ-టు-డిప్లాయ్ బయో-డిజిటల్ వర్క్‌ఫోర్స్”ను నిర్మించడంలో తెలంగాణ భారీగా పెట్టుబడులు పెడుతోందని శ్రీధర్‌బాబు అన్నారు.
లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం రెండూ తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుకు నిదర్శనమని, అధునాతన సైన్స్, టెక్నాలజీ డొమైన్లలో నెక్స్ట్ జనరేషన్ ప్రతిభను సృష్టించడానికి రూపొందించామని ఆయన అన్నారు.
లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్‌ఇండియా స్కిల్మ్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్ బయో డిజిటల్ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసు కుంది. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ సద స్సు ‘విక్టోరియా తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలి’అని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
సెల్, జీన్ థెరపీ, బయోలాజిక్స్, బయోసిమిలర్లు, mRNA వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (CRDM), డయాగ్నోస్టిక్స్, మెడ్‌టెక్, డిజిటల్ హెల్త్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆస్ట్రేలియన్ కంపెనీలను ఆహ్వానించారు.


