న్యూఢిల్లీ: అక్రమ వలసలపై అమెరికా కొరడా ఝళిపిస్తూనే ఉంది. తాజాగా 54 మంది హర్యానా వాసులను అగ్రరాజ్యం బహిష్కరించింది. వీరంతా అమెరికా అక్రమ మార్గం అయిన డంకీ రూట్ ద్వారా ప్రవేశించారనే ఆరోపణలతో వారిని వెనక్కి పంపింది. వారు OAE-4767 విమానంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, టెర్మినల్-3కి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం… ఈ యువకులలో 16 మంది కర్నాల్ నుండి, 15 మంది కైతాల్ నుండి, 5 మంది అంబాలా నుండి, నలుగురు యమునా నగర్ నుండి, మరోనలుగురు కురుక్షేత్ర నుండి, ముగ్గురు జింద్ నుండి, సోనిపట్-పంచకుల నుండి ఇద్దరు, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు.
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, బహిష్కరణకు గురైన యువకులలో ఎక్కువ మంది 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. కర్నాల్ పోలీసులు వారిని కుటుంబాలకు అప్పగించారు. అక్రమ వలసలపై ట్రంప్ పరిపాలన కఠిన వైఖరి కారణంగా బహిష్కరణలు పెరిగాయి. ఈ బహిష్కరణకు గురైన వ్యక్తులు డంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించారని కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ అన్నారు. అయితే ఏ ఏజెంట్ గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో, వందలాది మంది భారతీయులను అమెరికా అధికారులు బహిష్కరించారు. వలస చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను అమెరికా ప్రభుత్వం క్రమం తప్పకుండా బహిష్కరిస్తూనే ఉంది. ఈ సంవత్సరం జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆ దేశ చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ప్రారంభించాయి.


