ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న మూడు గంటల పాటు సాగిన కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. ఈ సందర్భంగా 17 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలను రక్షించారు. కాగా, కిడ్నాపర్ బుల్లెట్ గాయంతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే… వెబ్‌సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి కొంతమంది పిల్లల్ని స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ పిల్లల్ని కిడ్నాపర్ చెరనుండి విడిపించారు.పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మృతిచెందాడు.
పొవాయ్ ప్రాంతంలో మహావీర్ క్లాసిక్ భవనంలోని ఆర్ ఎ స్టూడియోలో పనిచేసే వ్యక్తి 17 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నాడని పోవాయి పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను అతడు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లను స్టూడియో నుంచి బయటకు వెళ్లకుండా నిర్భంధించాడు. దీంతో భయపడ్డ పిల్లలు కేకలు వేయడంతో రహదారిపై వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం, క్విక్ రెస్పాన్స్ బృందాలతో కలిసి స్టూడియోకు వచ్చారు. ఆలోపే ఆర్య…తాను కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలి అని ఒకటిన్నర నిమిషం నిడివితో ఒక వీడియోను సామాజిక మాథ్యమాల్లో రిలీజ్ చేశాడు. అయితే పిల్లలను రక్షించేందుకు ముంబై పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
ఎట్టకేలను నిందితుడ్ని హతమార్చి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలిలో ఎయిర్ గన్, కొన్ని కెమికల్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్పష్టం చేశారు. అయితే నిందితుడు రోహిత్ ఆర్య మతిస్థిమితం బాగాలేక ఇలా ప్రవర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
మహారాష్ట్ర విద్యా శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్ కోసం తన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, పూణేలో నిరసన కూడా నిర్వహించాడని పోలీసులు ప్రకటించారు.
ఈమేరకు కిడ్నాపర్ భార్య అంజలి ఆర్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తన భర్త స్వచ్ఛతా మానిటర్ ప్రాజెక్ట్ పెండింగ్ చెల్లింపు కోసం పోరాడుతున్నాడని చెప్పారు.
“అతను PLC స్వచ్ఛతా మానిటర్‌కు ప్రాజెక్ట్ హెడ్. మహారాష్ట్ర మాజీ పాఠశాల విద్యా మంత్రి దీపక్ కేసర్కార్ సాహెబ్ ఈ ప్రాజెక్ట్‌ను ఇష్టపడ్డాడు.రాష్ట్ర ప్రభుత్వం దాని కోసం 2 కోట్లు మంజూరు చేస్తోందని అతనికి చెప్పాడు. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయింది, కానీ రోహిత్‌కు నిధులు చెల్లించలేదు. అతనికి గుర్తింపు కూడా రాలేదు” అని ఆమె ఆరోపించింది.
కాగా, మాజీ మంత్రి మాట్లాడుతూ… “నేను ఎవరి చెల్లింపులోనూ డిఫాల్ట్ కాలేదు. మర్యాదపూర్వకంగా చెక్కు ద్వారా అతనికి సహాయం చేశాను. అతను ఒక వెబ్‌సైట్‌ను తెరిచి విద్యార్థుల నుండి నేరుగా డబ్బు తీసుకున్నాడని డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడింది. డిపార్ట్‌మెంట్ అతని నుండి వివరణ కోరిందని కేసర్కార్ అన్నారు.
గత ఏడాది జనవరి 25 నాటి పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వ తీర్మానం ప్రకారం…2023 జూలై 20 నుండి అక్టోబర్ 2వరకు స్వచ్ఛతా మానిటర్ చొరవను నిర్వహించిన ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్‌కు రోహిత్ ఆర్య డైరెక్టర్‌గా ఉన్నాడు.


