హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం నేత, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. ఈరోజు ఉదయం చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఈ హత్య జరిగింది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన రామారావుపై కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశారు.
స్థానికులు రోడ్డుపక్కన ఆయన మృతదేహాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రామారావు గతంలో రెండుసార్లు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పాతర్లపాడు గ్రామ సర్పంచ్ పదవిని కూడా నిర్వహించారు.
నేరస్థలాన్ని సందర్శించిన ఖమ్మం సీపీ
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేరస్థలాన్ని సందర్శించి, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరరావు, అనేక మంది ఇతర పార్టీ నాయకులు రామారావు కుటుంబ సభ్యులను కలిసి వారి సంతాపం తెలిపారు. పాతర్లపాడులో శాంతిభద్రతలను కాపాడటానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
నేరస్తులను అరెస్టు చేయండి: ఉప ముఖ్యమంత్రి
సీపీఎం నేత రామారావు హత్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని, హత్యకు కారణమైన వారిని గుర్తించి చట్టం ప్రకారం శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
ఈమేరకు ఖమ్మం జిల్లా పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఆదేశించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సైబర్ టీమ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోలీసుకుల దిశానిర్దేశం చేశారు.


