Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో శక్తివంతమైన భూకంపం… ఏడుగురు మృతి, 150 మందికి గాయాలు!

Share It:

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రకృతి పగబట్టింది. తరచూ ప్రకృతివైపరీత్యాలు సంభవించడం మామూలైపోయింది. తాజాగా మజార్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనితో కనీసం ఏడుగురు మరణించగా, 150 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

మజార్-ఇ-షరీఫ్ సమీపంలో 28 కి.మీ లోతులో ఈరోజు తెల్లవారుజామున 12:59 గంటలకు భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని ప్రకారం ఖుల్మ్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సమీప ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఘోర విపత్తు కారణంగా మజార్‌-ఎ షరీఫ్‌ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అన్ని నివేదికలు వచ్చిన తరువాత నష్టం తీవ్రతపై వార్తా సంస్థలతో పంచుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంపం ధాటికి మజార్-ఇ-షరీఫ్ పవిత్ర మందిరంలో కొంత భాగాన్ని కూడా నాశనం చేసిందని బాల్ఖ్ ప్రావిన్స్ ప్రతినిధి హాజీ జైద్… బ్లూ మసీదును ప్రస్తావిస్తూ అన్నారు.

దాదాపు 523,000 మంది జనాభా ఉన్న మజార్-ఇ-షరీఫ్ నగరంలో, చాలా మంది స్థానికులు తమ ఇళ్ళు కూలిపోతాయనే భయంతో అర్ధరాత్రి వీధిలోకి పరిగెత్తారని AFP ప్రతినిధి ఒకరు తెలిపారు.

తాలిబన్లు 2021లో దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మూడు పెద్ద ప్రాణాంతక భూకంపాలను ఎదుర్కొన్న ఆప్ఘన్‌ ప్రభుత్వానికి ఈ తాజా ప్రకృతి వైపరీత్యం దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం తీసుకురానుంది.

గత ఆగస్టులో ఆఫ్ఘన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన భూకంపం సంభవించి 2,200 మందికి పైగా ప్రాణాలను హరించింది.

ఇక 2023లో ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ హెరాత్‌లో , 2022లో తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో సంభవించిన పెద్ద భూకంపాలు వందలాది మందిని చంపి, వేలాది ఇళ్లను ధ్వంసం చేశాయి.

కాగా, ఆప్ఘన్‌ దేశంలో భూకంపాలు సర్వసాధారణం. ముఖ్యంగా యురేషియా, భారతీయ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశానికి సమీపంలో ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణి వెంబడి తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.