హైదరాబాద్: పుస్తక ప్రియులకు గొప్ప శుభవార్త. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వేళైంది. 38వ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి 29 వరకు ఇందిరా పార్క్ సమీపంలోని కాళోజీ కళా క్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతుందని కమిటీ ప్రకటించింది. ఈమేరకు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో బుక్ ఫెయిర్ సలహాదారులు ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ ఎడిటర్ కె రామచంద్ర మూర్తి ఈ ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు జరిగే ఫెయిర్
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… గత ఎడిషన్ల నుండి పాఠాలు నేర్చుకున్నామని, ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ మరింత ఆకర్షణీయంగా, విజ్ఞానదాయకంగా ఉంటుందని చెప్పారు. ఫెయిర్‌లో పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
ఈమేరకు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డాక్టర్ యాకూబ్, కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ… పుస్తకాల పట్ల ప్రేమను పెంపొందించడమే ఈ బుక్ ఫేయిర్ లక్ష్యమన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1గంటల నుంచి రాత్రి 9గంటల వరకు బుక్‌ఫెయిర్ అందుబాటులో ఉంటుందని, ఈ ఏడాది దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిషర్స్ వస్తున్నారని, 260 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, స్టాళ్ల బుకింగ్ కోసం నవంబర్ 30 వరకు బుక్ ఫెయిర్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో కోశాధికారి పి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు బి శోబన్ బాబు, జాయింట్ సెక్రటరీ కె సురేష్, మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎ జనార్దన్ గుప్తా, యు శ్రీనివాసరావు, టి సాంబశివరావు, స్వరాజ్ కుమార్, డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


