ముంబయి: పూణేలో భూ ఒప్పంద వివాదం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొడుకు పార్ధ్‌పవార్‌కు చెందిన కంపెనీకీ కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా దోచిపెట్టిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో డీల్ రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు.
తన కుమారుడు పార్థ్ పవార్ సంస్థ కొనుగోలు చేయాలనుకున్న రూ. 300 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదని తన కొడుక్కి తెలియదని, వివాదం రేగడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భూ ఒప్పందానికి సంబంధించి దర్యాప్తునకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఓ నెలలోపు దానిపై నివేదికను సమర్పిస్తుందన్నారు. ‘ఒప్పందానికి సంబంధించిన పత్రాల రిజిస్ట్రేషన్ ను రద్దు చేశాం. దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది. దీన్ని అమ్మడం లేదా కొనడం లాంటిది చేయడానికి లేదు. పార్థ్, అతడి భాగస్వామి దిగ్విజయ్ పాటిల్‌కు ఈ విషయం తెలియదు’ అని పవార్ పేర్కొన్నారు.
40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడంలో తక్కువ విలువ, విధానపరమైన అవకతవకలు, రాజకీయ ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణల మధ్య NCP నేత, డిప్యూటీ సీఎం అయిన అజిత్‌పవార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి చెందిన ఈ భూమిని పార్థ్ భాగస్వామిగా ఉన్న అమీడియా ఎంటర్‌ప్రైజెస్‌కు దాదాపు రూ. 300 కోట్లకు విక్రయించినట్లు సమాచారం, అయితే దాని వాస్తవ మార్కెట్ విలువ దాదాపు రూ. 1,800 కోట్లు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వివాదం తీవ్రమవడంతో, ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. సేల్ డీడ్‌లో పాల్గొన్న ఇతర వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై దుర్వినియోగం, మోసం, స్టాంప్ డ్యూటీ ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.
ఎఫ్ఐఆర్లో భాగస్వామి పాటిల్‌తో సహా ముగ్గురు వ్యక్తుల పేర్లు ఉన్నాయని, కానీ అతని కుమారుడు పేరు లేదని, కేవలం ఆ ముగ్గురు మాత్రమే పత్రాలపై సంతకం చేయడానికి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారని అజిత్ పవార్ తెలిపారు. ఏదైనా అవకతవకలు జరిగితే తన బంధువులకు సంబంధించిన ఇతర భూ ఒప్పందాలను రద్దు చేసి, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
ఈ వివాదానికి సంబంధించి నిన్నంతా అజిత్ పవార్ వరుస ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరేతో దేవగిరి నివాసంలో చర్చలు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి వర్ష బంగ్లాలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో జరిగిన సమావేశంలో అజిత్ పాల్గొన్నారు.


