ఇస్తాంబుల్: గాజాలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా హమాస్ “నిర్మాణాత్మక చర్యలు” తీసుకుంటోందని టర్కీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఇలాంటి సంకల్పాన్ని చూపించాలని ఆయన అభిలషించారు.
ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టితో అంకారాలో జరిగిన సంయుక్త వార్తా సమావేశంలో ఫిడాన్ మాట్లాడుతూ… గాజా పాలస్తీనాలో విడదీయరాని భాగమని, స్పష్టమైన UN-మద్దతు గల చట్రంలో పాలస్తీనియన్లచే పాలన కొనసాగించాలని నొక్కి చెప్పారు.
“గాజా పాలస్తీనాలో భాగం, అది అలాగే ఉండాలి.అలాగే పరిగణించాలి” అని ఫిడాన్ అన్నారు, మానవతా సహాయంపై ఆంక్షలను ఎత్తివేయాలని, అన్ని సరిహద్దు క్రాసింగ్‌లను తెరవాలని ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ను కోరారు.
టర్కిష్ మానవతా సహాయాన్ని గాజాకు అందించడంలో ఈజిప్ట్ సహాయం పట్ల మంత్రి ప్రశంసలు వ్యక్తం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ఎన్‌క్లేవ్ కోసం అంతర్జాతీయ పునర్నిర్మాణ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. “శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ, వైద్య, మానవతా సహాయం ప్రవేశించడం మరింత అత్యవసరమని” ఆయన జోడించారు.
ద్వైపాక్షిక సంబంధాలపై ఫిడాన్ మాట్లాడుతూ… అంకారా-కైరో మధ్య పెరుగుతున్న ఆర్థిక, రక్షణ సహకారాన్ని హైలైట్ చేశారు. ఈజిప్ట్‌కు టర్కీయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఇప్పుడున్న $9 బిలియన్ల వాణిజ్య పరిమాణం… రాబోయే సంవత్సరాల్లో $15 బిలియన్లకు చేరుకోవాలనే ఉమ్మడి లక్ష్యంతో ఉందని పేర్కొన్నారు.
‘ఈజిప్టును సందర్శించనున్న ఎర్డోగన్ ’
కాగా, అంకారాలో జరిగిన చర్చలను ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను కవర్ చేసే “ఫలవంతమైన సంప్రదింపులు” అని టర్కీ విదేశాంగమంత్రి అభివర్ణించారు. అంతేకాదు అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ త్వరలో కైరోలో జరిగే తదుపరి ఉన్నత స్థాయి వ్యూహాత్మక సహకార మండలి సమావేశానికి హాజరవుతారని ప్రకటించారు.
మరోవంక ఈజిప్టు విదేశాంగమంత్రి మాట్లాడుతూ… సిరియా భద్రత, స్థిరత్వం, సార్వభౌమాధికారానికి కైరో పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. డమాస్కస్ పొరుగు దేశాలకు ఎటువంటి ముప్పు కలిగించదని నొక్కి చెప్పారు.


