న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేలుడుకు సంబంధించి దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ పేలుడుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వైద్యులు సహా నలుగురిని ‘ఎన్‌ఐఏ’ విడుదల చేసింది. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో వారికి ఎటువంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు.
విడుదలైన వ్యక్తులు – డాక్టర్ రెహాన్, డాక్టర్ ముహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా – వీరందరినీ ఇటీవల హర్యానాలోని నుహ్‌లో అరెస్టు చేసారు. ఈ వైద్యులు గతంలో ఉమర్‌తో సంబంధాలు కలిగి ఉన్నారా?, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం కలిగి ఉన్నారా?, పేలుడు పదార్థాల కోసం ఏమైనా రసాయనాలను ఎరువుల వ్యాపారి నుండి సేకరించారా అని కూడా NIA అన్వేషించింది.
మూడు రోజుల పాటు తీవ్రంగా ప్రశ్నించిన తర్వాత, ఆ నలుగురిపై ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు. వారి కుటుంబాలు వారి విడుదలను ధృవీకరించాయి కానీ, దీనిపై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించాయి. అయితే, NIA వారిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది.
ఇప్పటివరకు, పేలుడుకు సంబంధించి మేవాట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, వారిలో నలుగురిని ఇప్పుడు విడుదల చేశారు. దొరికిన మొబైల్ ఫోన్‌లు, CCTV ఫుటేజ్‌ల నుండి కొత్త ఆధారాల ఆధారంగా దర్యాప్తు మేవాట్‌కు విస్తరించింది.
నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన హ్యుందాయ్ i20 పేలుడులో 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఫరీదాబాద్‌లోని అల్-ఫలా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న జమ్మూ – కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ ఉమర్ కీలక వ్యక్తిగా దర్యాప్తులో తేలింది.
విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు సహా ఉన్నత విద్యావంతులైన నిపుణులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న “వైట్-కోట్” టెర్రర్ మాడ్యూల్‌ను పరిశోధకులు కనుగొన్నారు. మాడ్యూల్‌తో సంబంధం ఉన్న దాడుల్లో దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి .
ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుళ నగరాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత కుట్ర జరిగిందని తదుపరి దర్యాప్తులో తేలింది. పేలుడు దర్యాప్తుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుండి అనేక మంది వ్యక్తులను అరెస్టు చేశారు.


