న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది. వాయు కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఇండియా గేట్‌కు సమీపంలో ఆదివారం నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీనిలో పొలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. కాగా, ఈ ప్రదర్శనలో మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము”, “మాకు విషం ఇవ్వడం ఆపండి” అని రాసిఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
దీనిపై ఢిల్లీ పోలీసులు 22మందిని అరెస్టు చేశారు. వేర్వేరుగా రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అనుమతి లేకుండానే ఇండియా గేట్ వద్ద నిరసనల నుండి వారిని పంపేయడానికి ప్రయత్నించినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆందోళనకారులను అక్కడ నుండి తొలగించడానికి తాము ప్రయత్నించగా, తమపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారని పోలీసు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా ప్రకారం… నిరసనలో పాల్గొన్నవారు పెప్పర్ స్ప్రే ఉపయోగించడం—మొదటిసారి చోటుచేసుకుందని తెలిపారు. కొంతమంది నిరసనకారులు ఇండియా గేట్ వద్ద గుమిగూడారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు. బారికేడ్లను బద్దలు కొట్టి రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. దీంతో చాలా అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడ్డారు.
ఈ క్రమంలో నిరసనకారులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించాం. ట్రాఫిక్‌కు అంతరాయం కలగించొద్దని విజ్ఞప్తి చేశాం. అక్కడ నుంచి వారిని చెదరగొట్టే సమయంలో పోలీసులతో నిరసనకారులు గొడవపడ్డారని దిల్లీ డీసీపీ దేవేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇండియా గేట్ సి హెక్సాగన్ వద్ద వారిని అడ్డగించగా వారందరూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళారని అక్కడ వున్న అధికారులతో మరో ఘర్షణ జరిగిందని వారు చెప్పారు.
అయితే నిరసనకారులు పోలీసులు కట్టుకథలు చెప్తున్నారని, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిద్మా పోస్టర్లను ప్రదర్శించినందుకే తమను టార్గెట్ చేశారని వారు స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర ఎయిర్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని, కాలుష్యం పెరిగే రోజుల్లో స్పష్టమైన ఆరోగ్య హెచ్చరికలు ఇవ్వాలని, అలాగే పబ్లిక్ ఫండ్‌ల వినియోగంపై పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇండియా గేట్ వద్ద జరిగిన పోలీసు చర్యను ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. స్వచ్ఛమైన గాలిని డిమాండ్ చేస్తున్న పౌరులను భద్రతా ముప్పుగా ఎందుకు పరిగణిస్తున్నారని ప్రశ్నించారు.
ఈమేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ… నిర్బంధాలు “ప్రభుత్వం శాంతియుత ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పట్ల ఎంత అసహనంగా మారిందో” చూపిస్తాయని, “స్వచ్ఛమైన గాలి అనేది ప్రాథమిక మానవ హక్కు, పౌరులను దానిని కోరినందుకు నేరస్థులలాగా చూడలేమని” అన్నారు. పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రభుత్వం “ పట్టించుకోదు” అని కూడా ఆయన రాశారు.
ఇక శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే నిర్బంధాల వీడియోలను పోస్ట్ చేస్తూ… కాలుష్య నిరోధక ప్రదర్శనకారులపై పోలీసులను ఉపయోగించడం “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం” అనే ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. “స్వచ్ఛమైన గాలిని అడిగినందుకు పౌరులను అరెస్టు చేస్తున్నారు” అని ఆయన అన్నారు.


