హైదరాబాద్: సైబర్‌నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాపు మొదలెట్టారు. దీంతో సైబర్ నేరగాళ్ల బండారం బయటపడింది. 8 మంది సభ్యుల మ్యూల్ అకౌంట్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముగ్గురు ప్రధాన మోసగాళ్లు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2023లో, ప్రధాన నిందితుడు జగదీష్, కన్నయ్యను కలిశాడు, అతను ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.10,000 ఆఫర్ చేశాడు. జగదీష్ తన సొంత ఐడీ, అతని భార్య, అతని తల్లి, అతని బంధువులు, అతని స్నేహితులను ఉపయోగించి వివిధ బ్యాంకులలో పలు ఖాతాలను తెరిచాడు.
అన్ని పాస్‌బుక్‌లు, ATM కార్డులు, చెక్‌బుక్‌లు, ఆధారాలను కమిషన్ కోసం అప్పగించారు. పత్రాలను బ్లూ డార్ట్ కొరియర్ ద్వారా పంపారు. మోసగాళ్ళు పూనమ్,రమేష్ తరువాత ఈ చైన్‌లో చేరారు. ముఠాలోని కొందరు ఉప సమూహాలుగా ఏర్పడి ఖాతాలు తెరవడంలో ఒకరినొకరు సహకరించుకున్నారు. వారు 127 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను తెరిచి ఆ ఖాతాల్లోకి రూ.24,10,16,618 కోట్లు జమ చేశారు. అందులో రూ.23,99,31,550 కోట్లు విత్‌డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా రూ.16లక్షలను తాము ఫ్రీజ్ చేశామని అడిషనల్ సీపీ తెలిపారు.
పోలీసులు 11 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 14 ATM కార్డులు, 12 చెక్ పుస్తకాలు, ఖాతా వివరాలతో కూడిన 2 నోట్‌బుక్‌లు, 6 సిమ్ కార్డులు, 8 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ అంతటా కేసుల్లో ప్రమేయం ఉంది.పరారీలో ఉన్న సైబర్ మోసగాళ్లను గుర్తించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇతరుల కోసం బ్యాంకు ఖాతాలను తెరవవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలియకుండా మీ అకౌంట్‌లో డబ్బులు పడి అకౌంట్ ఫ్రీజ్ అయి ఉంటే సైబర్ పోలీసులను కలిసి తమకు సంబంధం లేదని రాసిస్తే, దానిపై దర్యాప్తు చేసి ఖాతాను పునరుద్ధరిస్తామని సీసీఎస్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ చెప్పారు.


