Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘దక్షిణాఫ్రికాకు పూర్తిగా సరెండర్‌ అయిన టీం ఇండియా’…కోచ్‌ ‘గంభీర్‌’పై తీవ్ర విమర్శలు!

Share It:

న్యూఢిల్లీ: గువహతిలో జరిగిన రెండో టెస్ట్‌లోనూ టెస్ట్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో సొంతగడ్డపై 2-0 తేడాతో భారత్‌ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. అంటే ఈ సిరీస్‌లోనూ మన టీమ్‌ వైట్‌వాష్‌ అయింది. కొల్‌కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్, గువాహటి టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో పరాభవం పాలయ్యింది. ఇది కేవలం ఓటమి కాదు.. టెస్టు జట్టులో ఉన్న లోపాలను బహిర్గతం చేసిన సందర్భంగా మనం గుర్తించాలి.

కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకు రెండు టెస్టు సిరిస్‌లలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా జరగలేదు. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు 25ఏళ్ల తరువాత దక్షిణాఫ్రికాకు సిరీస్‌ సమర్పించుకుంది.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గువాహటిలో ఘోర పరాజయం తర్వాత, స్టేడియంలో గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహమ్మద్ సిరాజ్ జోక్యం చేసుకుని అభిమానులను శాంతింపజేశాడు. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆట తీరుపై నిరాశను వ్యక్తం చేస్తూ గంభీర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం కోచ్ నిర్ణయాలే అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.

వరుస వైట్‌వాష్‌లు, వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు, సీనియర్ల తప్పుకోవడం, జట్టులోని అంతర్గత సమస్యలు.. ఇన్నీ కూడి ఇప్పుడు బీసీసీఐ దృష్టి కోచ్ గంభీర్ వైపు మళ్లింది. సోషల్ మీడియాలో ఇదే గంభీర్‌కు చివరి టెస్టు అనే చర్చ మొదలైంది.

గత 15 నెలల్లో వన్డేలు, టెస్టుల్లో భారత్ ఎదుర్కొన్న పరాజయాలు, అనేక వివాదాస్పద సెలక్షన్ నిర్ణయాలతో ఏర్పడిన ఈ పరిస్థితులను మార్చడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్, మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.

గత 18 టెస్టుల్లో భారత్ 9 మ్యాచుల్లో ఓడిపోవడం గమనార్హం. సొంతగడ్డపై స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేయించుకున్నా, మన బ్యాటర్లే వాటిని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. గువహటి టెస్టులో 547 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ కేవలం 140 పరుగులకే కుప్పకూలింది.

దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల్లోనూ భారత బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. అగ్రశ్రేణి బ్యాటర్లందరూ విఫలమయ్యారు — కె ఎల్ రాహుల్ (17 సగటుతో 68 పరుగులు), యశస్వి జైస్వాల్ (83 @20.75), రిషబ్ పంత్ (49 పరుగులు) సాయి సుదర్శన్ (14.50 @29 పరుగులు), ధ్రువ్ జురెల్ (7.25 @29 పరుగులు).

కాగా, ఈ సిరీస్‌లో భారత పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనను స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే విమర్శించారు.

‘భారత బ్యాటింగ్ నిరాశపరిచింది. నాలుగు ఇన్నింగ్స్‌లను తిరిగి చూసుకుంటే, జట్టు గరిష్టంగా 83.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది, దీనికి కారణం కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మధ్య బలమైన భాగస్వామ్యం. అయితే, దక్షిణాఫ్రికాకు మనం పూర్తిగా దాసోహం’ అయ్యామని కుంబ్లే జియోస్టార్ మ్యాచ్-అనంతర షో క్రికెట్ లైవ్‌లో అన్నారు.

‘దక్షిణాఫ్రికా బౌలింగ్ అద్భుతంగా ఉంది, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ, విజయానికి పోరాటం, అనుకూలత, దృఢ సంకల్పం అవసరం. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం, చొరవ తీసుకోవడం సానుకూలంగా ఉండటం ద్వారా రవీంద్ర జడేజా దీనిని ప్రదర్శించాడని కుంబ్లే అన్నారు.’

టెస్టులలో 70,వన్డే ఇంటర్నేషనల్స్‌లో 61 విజయ శాతంతో భారతదేశంలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరైన కుంబ్లే, భారతదేశం ప్లేయింగ్ XIలో తరచుగా మార్పులు జరగడాన్ని విమర్శించారు.

‘ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో ఓటమి. న్యూజిలాండ్‌తో 3-0 తేడాతో ఓటమి, కేవలం ఫలితాలకు మించి విస్తృత సమస్యలను ప్రతిబింబిస్తాయి. భారతదేశం కొన్ని విభాగాలలో మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది, కానీ చివరికి తడబడింది.

‘టెస్ట్ క్రికెట్‌కు అవసరమైనది భిన్నమైన మనస్తత్వం; ప్లేయింగ్ XIలో స్థిరమైన మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్‌లు తరచుగా మార్పలు స్థిరత్వాన్ని నిరోధిస్తాయి.’

‘గాయాలు, ఫామ్ డిప్స్ అర్థంచేసుకోదగ్గవే అయినప్పటికీ… భారతదేశం లోతుగా ఆలోచించడానికి సమయం తీసుకోవాలి. తదుపరి టెస్ట్ 2026 ఆగస్టులో మాత్రమే, భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు దిశపై ఆలోచనాత్మక చర్చకు అవకాశం ఉంది.’

గత 12 నెలలుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు టెస్ట్ క్రికెట్‌కు దూరమయిన నేపథ్యంలో ఈ క్లిష్ట కాలంలో జట్టును నడిపించడానికి సరైన ప్రణాళికను రూపొందించాలని కుంబ్లే బీసీసీఐకి పిలుపునిచ్చారు.

‘ఇటీవలి నెలల్లో అనేక మంది కీలక ఆటగాళ్ల రిటైర్‌ కావడం జట్టులో ఒక రకమైన శూన్యతను సృష్టించింది. కొత్త ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి,పెంపొందించడానికి జట్టుకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరం’ అని కుంబ్లే అన్నారు.

‘దృఢమైన పునాది లేకుండా ఒకేసారి చాలా మంది అనుభవం లేని ఆటగాళ్లను పరిచయం చేయడం పనిచేయదు. ఎక్కువగా అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన బలమైన లైనప్, ఒకటి లేదా ఇద్దరు కొత్తవారితో అనుబంధంగా ఉండటం, స్థిరమైన విజయానికి చాలా అవసరమని కుంబ్లే అన్నారు.’

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.