గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ పదేపదే తూట్లు పొడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ జరిపిన తాజా కాల్పుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు, తూర్పు గాజా నగరంలోని అల్ తుఫా పరిసరాల్లో డజన్ల కొద్దీ పాలస్తీనియన్ కుటుంబాలు ఇజ్రాయెల్ కాల్పుల్లో చిక్కుకున్నాయి. ఆ ప్రాంతం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తరువాత డ్రోన్లు, ట్యాంకులతో కాల్పులకు తెగపడ్డాయి.
ఇజ్రాయెల్ క్వాడ్‌కాప్టర్ డ్రోన్ కాల్పులు జరిపిన తర్వాత ఒక పాలస్తీనియన్ మహిళను మధ్య గాజా నగరంలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య వర్గాలు అనడోలు వార్తాసంస్థకు తెలిపాయి. తరువాత గాజా సివిల్ డిఫెన్స్ బృందాలు అల్ తుఫాలోని అల్ సనాఫోర్ కూడలి సమీపంలో గాయపడ్డ మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించాయి.
ఇజ్రాయెల్ కాల్పుల్లో డజన్ల కొద్దీ నిర్వాసిత పాలస్తీనియన్ కుటుంబాలు చిక్కుకున్నాయని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అత్యవసర విజ్ఞప్తి చేసింది. రెస్‌క్యూ బృందాలు ఈ ప్రాంతం నుండి పౌరులను తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని వార్తాసంస్థ పేర్కొంది.
ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూపు హమాస్ మధ్య అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం గతంలో వెనక్కి తగ్గిన ప్రాంతాలలో ఇజ్రాయెల్ కాల్పులు జరిగాయని అనడోలు వార్తా ప్రతినిధి నివేదించారు.
గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రకారం…కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 342 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 900 మంది గాయపడ్డారు.
మొత్తంగా అక్టోబర్ 2023 నుండి ఇజ్రాయెల్ సైన్యం గాజాలో 70,000 మందికి పైగా ప్రజలను చంపింది. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో లక్షా 71వేల మందికి పైగా గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ బాంబు దాడులు గాజాను ఓ శిథిల నగరంగా మార్చాయి.


