హైదరాబాద్: తెలంగాణ మహిళల సాతాధికారతే విజన్ డాక్యుమెంట్‌కు కీలకమని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047రూపకల్పనలో భాగంగా ఆమె మాట్లాడుతూ…తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని, దానిని 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు. ఇందులో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అలాగే మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా పెంచడానికి సమగ్ర వ్యూహం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. మహిళా సంక్షేమం,పోషకాహారం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. కోట్లాది మంది మహిళా కోటీశ్వరులను తయారు చేసే లక్ష్యంతో వివిధ వ్యాపారాలలో మహిళలను ప్రోత్సహించడానికి విజన్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందించాలని ఆమె అన్నారు.
అంతేకాదు మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి గుర్తు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం రూ.30 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని ఆమె అన్నారు.
ప్రైవేట్ రంగంలో కూడా మహిళా సంఘాల నైపుణ్యాన్ని వినియోగిస్తూ, ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల యూనిఫామ్ తయారీ పనులు మహిళా సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 2047 విజన్ ప్రకారం అన్ని మహిళలకు యూనివర్సల్ చైల్డ్ కేర్, యూనివర్సల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆమె పేర్కొన్నారు.
వచ్చే 2047 నాటికి రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం, ‘కోటి మంది మహిళా కోటీశ్వరులను’ తయారు చేసే కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుంది. ప్రతి మహిళ ఆర్థిక భద్రత, డిజిటల్ జ్ఞానం, వ్యాపార అవకాశాలు, ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా చర్యలను ప్రారంభించింది.
అంతేకాదు బాలికలు తమ విద్యను పూర్తి చేసుకునేలా స్కాలర్షిప్లు, రవాణా సౌకర్యాలను అందించడం, ఆర్థిక-డిజిటల్ అక్షరాస్యత, చిన్న వ్యాపార నైపుణ్యాలను బోధించడం, బాల్య వివాహాలను ఆపడానికి లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం, ఉద్యోగాలు, వ్యాపారాలకు సహాయం చేయడం, పనిచేసే మహిళల పిల్లల కోసం నాణ్యమైన క్రెచ్‌లను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. వివిధ రంగాలలో మహిళలను ప్రోత్సహించడం, మహిళల అభివృద్ధిపై కేంద్రీకృతమై ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందుతుందనే నమ్మకం మరింత బలపడుతుందని మంత్రి అన్నారు.


