న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య ఉన్న నమ్మకమైన స్నేహానికి గుర్తుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతానికి కృషిచేయనున్నారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లపాటు అంటే 2030 వరకు ఆర్థిక సహకార ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు చేర్చడమే ఈ ప్రణాళిక లక్ష్యమని తెలిపారు.
గత సంవత్సరం ద్వైపాక్షిక వాణిజ్యం 12% వృద్ధి చెంది, కొత్త రికార్డు స్థాపించింది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలు వారి వారి దేశాల కరెన్సీలలో చెల్లింపులు చేయనున్నారు. డాలర్‌కు చెక్ పెట్టనున్నారు. భారత్ శక్తి అవసరాలకు రష్యా నుంచి స్థిరమైన ఆయిల్, గ్యాస్, కోల్ సరఫరా. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీలో దశాబ్దాల సహకారం క్లీన్ ఎనర్జీకి దోహదపడుతోంది. క్రిటికల్ మినరల్స్ విషయంలో సహకారం కొనసాగుతుంది. ఈ ప్రణాళిక రెండు దేశాల ఆర్థిక వృద్ధికి, ప్రపంచ శక్తి భద్రతకు బలమైన పునాది వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా మోడీ, పుతిన్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. రెండు దేశాల మధ్య స్నేహం పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి స్థిరంగా ఉందని జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ స్వతంత్ర, సార్వభౌమాధికార విధానాన్ని అనుసరిస్తోందని పుతిన్ అన్నారు. అది మంచి ఫలితాలను ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంనుద్దేశించి పుతిన్ మాట్లాడుతూ, మోడీ తీసుకున్న చొరవ కారణంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వంటివి బాగా సాగుతున్నాయన్నారు. సాంకేతికంగా కూడా భారత్ సార్వభౌమాధికారంగా ఆవిర్భవిస్తోందన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ…“గత ఎనిమిది దశాబ్దాలుగా ప్రపంచం అనేక ఒడిదుడుకులను చూసింది. మానవత్వం అనేక సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంది. వీటన్నింటి ద్వారా, భారతదేశం-రష్యా స్నేహం ఒక ధ్రువ నక్షత్రంలా మిగిలిపోయింది” అని మోడీ తన మీడియా ప్రకటనలో తెలిపారు.
కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఆరోగ్యం-ఆహార భద్రత, ఓడరేవులు-నౌకాయానం, వలసలు-మొబిలిటీ వంటి రంగాలలో అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి.
రష్యా, భారతదేశం, ఇతర సారూప్య దేశాలు న్యాయమైన, బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు.


