హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనికాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రహదారిని ఇకపై ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పిలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన గురించి కేంద్ర విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. అదే రోజున, తెలంగాణ ప్రభుత్వం రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డు (RRR)తో అనుసంధానించే రాబోయే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది, రావిర్యాల వద్ద ఉన్న ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే ‘టాటా ఇంటర్‌చేంజ్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
అదేవిధంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ నిర్మిస్తున్న భారీ క్యాంపస్ సమీపంలోని రహదారికి ‘గూగుల్ స్ట్రీట్’ అని నామకరణం చేయనున్నారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ముఖ్యమైన రోడ్లకు ప్రపంచస్థాయి కార్పొరేషన్ల పేర్లు పెడతామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో ‘మైక్రోసాఫ్ట్ రోడ్’, ‘విప్రో జంక్షన్’ వంటి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, సీఎం నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చాలనుకుంటే చరిత్రను, వారసత్వాన్ని గుర్తు చేసేలా పేర్లు పెట్టాలని, అంతే తప్ప ఎవరు ట్రెండింగ్‌లో ఉంటే వారి పేరు పెట్టాలనుకోవడం సరికాదని విమర్శించారు.


