హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి దశ విజయవంతంగా ముగిసింది. మొత్తం 37,562 పోలింగ్ స్టేషన్లలో 3,834 మంది సర్పంచ్లు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి దశలో 84 శాతం అర్హత కలిగిన 53,57,277 మంది ఓటర్లలో 45,15,141 మంది (84.28 శాతం) తమ ఓట్లను వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తెలిపింది.
పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్ల మధ్య, పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అదనపు డిజిపి (శాంతిభద్రతలు) మహేష్ ఎం భగవత్ పిటిఐకి తెలిపారు. పోలింగ్ కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 90 శాతానికి పైగా స్థానాలను గెలుచుకున్నారని
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విజయం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. 396 గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఏకగ్రీవ ఎన్నికయ్యారని ఒక ప్రకటనలో తెలిపింది.
కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు సాధించిన ఘన విజయం పట్ల మహేష్ కుమార్ గౌడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రెండేళ్ల పాలన సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టింది, ఇది పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ఆయన అన్నారు.
“ప్రజలు సంక్షేమం, సామాజిక న్యాయం,అభివృద్ధి అనే మా నినాదాన్ని ఆమోదించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన అఖండ విజయం దానికి నిదర్శనం” అని గౌడ్ అన్నారు.
మరోవైపు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన లాభాలను సాధించిందని, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి మద్దతు పెరుగుతోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 25న డిసెంబర్ 11, 14, 17 తేదీలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు దశల షెడ్యూల్ను ప్రకటించింది.
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ప్రజాదరణకు పరీక్షగా భావిస్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి.


