చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును టీవీకే పార్టీ ప్రకటించింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్ళేందుకు మరింత వ్యూహాత్మకంగా విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయ్ సీఎం అభ్యర్థిగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల ఒప్పందంపై చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఆ పార్టీ తెలిపింది. అయితే పొత్తులపై తుది నిర్ణయం విజయ్ తీసుకుంటారని తెలిపింది.
“అవినీతితో డీఎంకేను అధికారంనుంచి తొలగించాలి. సంపన్నమైన కొత్త తమిళనాడును సృష్టించాలి. దీన్ని నిర్ధారించడానికి, మా నాయకుడు విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించే వారిని మా కూటమిలోకి స్వాగతిస్తాము” అని తమిళగ వెట్రి కజగం సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
టీవీకే పార్టీ ఆమోదించిన నాలుగు తీర్మానాలలో మరొకటి “తమిళనాడును రక్షించడానికి” ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ఒక మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
“ప్రత్యర్థుల అపవాదులను వ్యాప్తి చేస్తున్న వారి తప్పుడు వాదనలను బహిర్గతం చేయడానికి, వారిని ఎదుర్కోవడానికి” ఒక బలమైన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు మరో తీర్మానం పేర్కొంది.
అంతేకాదు ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, కూటమి ఏర్పాటులో ఏఏ పార్టీ ఉండాలి అన్న అంశంపై నిర్ణయాలు.. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉండాలి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీలు వాటికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తాయి.
ఈ సందర్భంగా టీవీకే చీఫ్ విజయ్ మాట్లాడుతూ… తమ సైద్ధాంతిక శత్రువులైన డీఎంకే, భాజపాలతో ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భాజపా విభజన రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు.


