సిడ్నీ: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరుగుతున్న యూదుల కార్యక్రమంలో ఆదివారం ఇద్దరు ముష్కరులు జరిపిన కాల్పుల్లో కనీసం 11 మంది మృతి చెందారని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు, దీనిని ఉగ్ర దాడిగా ప్రకటించారు. ఒక ముష్కరుడిని పోలీసులు కాల్చి చంపగా, రెండవ వ్యక్తిని అరెస్టు చేశారు.
నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అత్యవసర చర్య చేపట్టామని, గాయపడిన వారిని అంబులెన్స్‌లలో తరలించామని చెప్పారు. కనీసం 29 మంది గాయపడినట్లు సిడ్నీ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర పోలీసు కమిషనర్ మాల్ లాన్యోన్ తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
“ఈ దాడి సిడ్నీ యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి చేసారని”, ఈ సంఘటనను లక్ష్యంగా చేసుకుని మరియు ఉపయోగించిన ఆయుధాల కారణంగా ఈ మారణహోమాన్ని ఉగ్రవాద దాడిగా ప్రకటించారని లాన్యోన్ చెప్పారు.
హనుక్కా యూదుల పండుగ ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్న బోండి బీచ్‌లో చానుకా బై ది సీ అనే కార్యక్రమానికి వందలాది మంది గుమిగూడిన సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
మెల్బోర్న్కు చెందిన 32 ఏళ్ల లాచ్లాన్ మోరాన్ సమీపంలో తన కుటుంబం కోసం వేచి ఉండగా కాల్పులు విన్నాడని అతను అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పాడు. అతను తన సోదరుడి కోసం తన వద్ద ఉన్న బీరును వదిలివేసి పరిగెత్తాడు.
“తుపాకి శబ్దాలు విని నేను భయపడి పారిపోయాను. … నేను వీలైనంత వేగంగా పరిగెత్తాను,” అని మోరాన్ అన్నారు. దాదాపు ఐదు నిమిషాల పాటు కాల్పులు విన్నానని ఆయన అన్నారు.
పోలీసులు ఈ ఘటనపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సమీపంలో ఉన్న అనేక అనుమానాస్పద వస్తువులను” స్పెషలిస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానిక వార్తా సంస్థలు బాధితులతో మాట్లాడాయి.
“ఈ రాత్రి ఆస్ట్రేలియా యూదు సమాజం కోసం మా హృదయం రక్తంతో నిండిపోయింది” అని మిన్స్ సిడ్నీలో విలేకరులతో అన్నారు. “ఈ పురాతన సెలవుదినాన్ని జరుపుకుంటున్న వారి ప్రియమైనవారు చంపబడటం చూసి వారు ఇప్పుడు అనుభవిస్తున్న బాధను నేను ఊహించగలను.”
కాల్పులపై ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్
బోన్డీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఆయన ‘‘దారుణమైన యూదు వ్యతిరేకత నుంచి పుట్టిన చర్య”*గా అభివర్ణించారు. ఈ ఘటన ఆస్ట్రేలియన్లపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడిగా పేర్కొంటూ, ఆనందంగా ఉండాల్సిన రోజున ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. “ఇది మా దేశ హృదయాన్ని కుదిపేసిన దారుణమైన యూదు వ్యతిరేక హింసాత్మక ఉగ్రవాద చర్య” అని ఆసీస్ ప్రధాని ఆల్బనీజ్ అన్నారు.
కాగా, ఆస్ట్రేలియాలో సామూహిక కాల్పుల మరణాలు చాలా అరుదు. 1996లో టాస్మానియన్ పట్టణంలోని పోర్ట్ ఆర్థర్‌లో జరిగిన ఊచకోతలో ఓ దుండగుడు 35 మందిని చంపాడు. దీనితో ప్రభుత్వం తుపాకీ చట్టాలను కఠినతరం చేసింది. ఆస్ట్రేలియన్లు తుపాకీలను పొందడం చాలా కష్టతరం చేసింది.
కాల్పులను ఖండించిన ఆస్ట్రేలియన్ ముస్లిం సమూహం
బోండి బీచ్ కాల్పులకు ఖండిస్తూ… ఆస్ట్రేలియన్ నేషనల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
“బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ఈ తీవ్ర బాధాకరమైన దాడిని చూసిన లేదా ప్రభావితమైన వారందరితో మా హృదయాలు, ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి” అని ఆస్ట్రేలియన్ నేషనల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
“ఆస్ట్రేలియన్ ముస్లిం సమాజంతో సహా అందరు ఆస్ట్రేలియన్లు ఐక్యత, కరుణ, సంఘీభావంతో కలిసి నిలబడవలసిన క్షణం ఇది” అని అది జోడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు.


