న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం మధురలోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఏడు బస్సులు, మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను గుర్తించారు. భారీ పొగమంచు కారణంగా బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయని, అవి మిగతా వాహనాలకు అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయన్నారు. అయితే క్షతగాత్రులు.. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈమేరకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) శ్లోక్ కుమార్ మాట్లాడుతూ… సహాయక చర్యలు పూర్తి చేశామని, అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ… “మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఢీకొన్నాయి” అని అన్నారు. “ప్రమాదం వల్ల కార్లు కూడా మంటల్లో చిక్కుకున్నాయి” అని ఆయన అన్నారు.
సహాయ చర్యల గురించి మాట్లాడుతూ… “మాకు వార్త అందిన వెంటనే అగ్నిమాపక , స్థానిక పోలీసులు, స్థానిక అధికారులను వెంటనే సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. గాయపడ్డ “సుమారు 25 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చామన్నారు; అయితే, వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. ప్రస్తుతం వారికి అవసరమైన వైద్య సహాయం అందుతోంది. మిగిలిన వారిని ప్రభుత్వ వాహనాల ద్వారా వారి ఇళ్లకు తరలించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.”
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ… మధుర జిల్లా మేజిస్ట్రేట్ (DM) చంద్ర ప్రకాష్ సింగ్ ఈ సంఘటనను “చాలా దురదృష్టకరం” అని అభివర్ణించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని, గాయపడినవారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందేలా చూసుకోవడంపై దృష్టి సారించిందని ఆయన చెప్పారు.
“ఇది చాలా దురదృష్టకర సంఘటన. ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను మేము వెలికితీశాము. 12 కి పైగా అగ్నిమాపక వాహనాలు, 14 కి పైగా అంబులెన్స్‌లను వెంటనే మోహరించాము. గాయపడిన వారిని సి.హెచ్.సి. బల్దేవ్ జిల్లా ఆసుపత్రికి పంపారు. వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. వారందరూ ప్రమాదం నుండి బయటపడినట్లేనని సింగ్ విలేకరులతో అన్నారు.
మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక రోజు ముందు కూడా ఇలాంటి సంఘటననే జరిగింది, ఆ సంఘటనలో దట్టమైన పొగమంచు దాదాపుగా పలు వాహనాలను ఢీకొన్నాయి. అయితే ఎవరూ గాయపడలేదు.


