ఢాకా: బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమానికి కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన షరీఫ్ ఉస్మాన్ హదిపై కాల్పులు జరగడంతో తీవ్రంగా గాయపడి, సింగపూర్‌లోని ఆసుపత్రిలో మరణించడంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో ఢాకాలోని కొన్ని పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హాదీ మరణాన్ని “దేశానికి తీరని లోటు”గా పేర్కొంటూ శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. హంతకులపై విచారణకు హామీ ఇచ్చింది.
సంఘటన వివరాలు
డిసెంబర్ 12న ముసుగు ధరించిన వ్యక్తులు హాదీని కాల్చి చంపారు, ఆయన తలకు గాయమైంది. సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 19న మరణించారు. అతని మరణ వార్తతో ఢాకాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు, కొన్ని వార్తాపత్రిక కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను మోహరించారు. ఈ నిరసనలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న అశాంతిని, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి.
‘భర్తీ చేయలేని నష్టం’
ప్రధాని షేక్ హసీనా విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత భారతదేశానికి పారిపోయాక, ఆగస్టు 2024 నుండి బంగ్లాదేశ్‌ను నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పరిపాలిస్తోంది. ఆ దేశ జాతీయ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి.
హాది మరణం తర్వాత దేశాన్ని ఉద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగించిన యూనస్…”ఆయన మరణం దేశ రాజకీయ, ప్రజాస్వామ్య రంగానికి పూడ్చలేని నష్టమని అన్నారు.”
పౌరులు ప్రశాంతంగా ఉండాలని కోరుతూ, ప్రభుత్వం పారదర్శక దర్యాప్తును నిర్ధారించడానికి, బాధ్యులందరినీ దోషులుగా నిలబెడతామని యూనస్ అన్నారు. హింస దేశం విశ్వసనీయ ఎన్నికల వైపు వెళ్ళే మార్గాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ, సంయమనం పాటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
హాది గౌరవార్థం తాత్కాలిక ప్రభుత్వం రేపు సంతాప దినంగా ప్రకటించింది. జాతీయ జెండాలను సగం ఎత్తులో ఎగురవేయాలి. దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని సూచించింది.


