న్యూఢిల్లీ: యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణానికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్‌లో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. వార్తాపత్రిక గృహాలను లక్ష్యంగా చేసుకుని హింస జరిగింది. ఆగ్రహంతో బంగ్లాదేశ్‌లోని రెండు ప్రముఖ పత్రికా కార్యాలయాలు… బెంగాలీ పత్రిక ప్రోథమ్ అలో, ఆంగ్ల పత్రిక డెయిలీ స్టార్‌పై దాడి చేసి వాటికి నిప్పు పెట్టారు. కొందరు ఆందోళనకారులు డెయిలీ స్టార్ కార్యాలయంలోని సిపియులు, మానిటర్లు, కుర్చీలను ఎత్తుకెళ్లారు.
హింస ఎంతకు తగ్గకపోవడంతో పత్రికా సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిరసనకారులు డెయిలీ స్టార్ పత్రిక కార్యాలయం వెలుపల న్యూ ఏజ్ సంపాదకుడు నూరుల్ కబీర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులతో మాట్లాడేందుకు ఆయన అక్కడికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. వారు ఆయనను అవామీలీగ్ ఏజెంట్ అంటూ నిందించారు. అల్లరి మూకలు రాజ్‌షాహీలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసినట్లు తెలిసింది. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను నిలుపుచేశాయి.
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన 2024 నిరసనలలో ప్రముఖ వ్యక్తి అయిన హాది గురువారం సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో గాయాలతో మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మృతదేహం ఢాకాకు చేరుకుంది. తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
హాది మరణం తర్వాత జరిగిన హింసను ఢాకా ఖండించింది. “కొన్ని విచ్ఛిన్న శక్తులు చేసిన మూక హింసను ప్రతిఘటించాలని” పౌరులకు పిలుపునిచ్చింది. హదీ సహా అనేక మంది నిరసనకారులు న్యూఢిల్లీ పట్ల వ్యతిరేకత చూపుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య కార్యాలయానికి గట్టి భద్రత కల్పించారు.
గురువారం హాదీ మరణవార్త ప్రకటించిన కొద్దిసేపటికే, నిరసనకారులు ప్రముఖ బెంగాలీ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో, ఆంగ్ల భాషా డైలీ స్టార్ కార్యాలయాలపై దాడి చేసి, ధ్వంసం చేసి, నిప్పంటించారు. అంతేకాదు శుక్రవారం తెల్లవారుజామున, ఢాకాలోని ధన్‌మోండి ప్రాంతంలోని సాంస్కృతిక సంస్థ ఛాయానౌత్ భవనాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. రాజ్‌షాహిలో హసీనా అవామీ లీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చివేసినట్లు సమాచారం.
చటోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ వెలుపల నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడిన ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందితో సహా కనీసం నలుగురు గాయపడ్డారని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ నివేదించింది. కాగా, ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో హింసను ఖండించింది.
“మనం ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తనను చేస్తున్నప్పుడు ఇది మన దేశ చరిత్రలో ఒక కీలకమైన క్షణం. గందరగోళంలో మునిగిపోయి శాంతిని తిరస్కరించే కొద్దిమంది దీనిని పట్టాలు తప్పడానికి మనం అనుమతించకూడదు” అని తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావిస్తూ పేర్కొంది.
ఖండించిన యూనస్
హాదీ మరణంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ విచారం వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఢాకాలో హింసాత్మక పరిణామాలను యూనస్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని, అందుకు కారకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాదీ మృతికి సంతాపపూచకంగా ప్రభుత్వం ఒక రోజు సంతాప దినం ప్రకటించింది.
బంగ్లాదేశ్ విద్యార్ధి నేత హత్యపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ కోరారు. తక్షణమే నిష్పాక్షికమైన రీతిలో వేగంగా దర్యాప్తు జరగాలని కోరారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డైలీ స్టార్,న్యూ ఏజ్ అపత్రికల సంపాదకులను ఉద్దేశించి – ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ… “మేము మీతో నిలబడతాము. మీరు ఎదుర్కొన్న హింసకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము … జర్నలిస్టులపై దాడులు సత్యంపైనే దాడులు. మేము మీకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు.”
“మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని మేము ఖండిస్తున్నాము. కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు చోటు లేదు. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోము” అని కూడా పేర్కొన్నారు.
సంస్కృతి సలహాదారు ముస్తఫా సర్వర్ ఫరూఖీ మాట్లాడుతూ…పత్రిక సంస్థలపై జరిగిన దాడులను, ఛాయానౌత్ భవనాన్ని ధ్వంసం చేయడం “నిస్సందేహంగా ఎన్నికలను దెబ్బతీసే కుట్ర” అని ఖండించారు.
“ఈ రోజు, మనం షహీద్ [అమరవీరుడు] ఉస్మాన్ హాది గురించి మాట్లాడవలసి ఉంది. నేడు, మనం దుఃఖంలో ఉండాల్సి ఉంది. అంశాన్ని ఎవరు మళ్లించారు? ప్రోథోమ్ అలో, డైలీ స్టార్, ఛాయానౌత్‌పై ఎవరు దాడి చేశారు? అలా చేసిన వారు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పరివర్తనను కోరుకోరు” అని ఆయన చెప్పినట్లు bdnews24.com నివేదించింది.
ఆ సంస్థలపై దాడి తర్వాత, బంగ్లాదేశ్ శిల్పకళా అకాడమీ తన కార్యక్రమాలను నిరవధికంగా నిలిపివేసిందని bdnews24.com నివేదించింది.
అదే సమయంలో శుక్రవారం మధ్యాహ్నం, ఢాకాలోని షాబాగ్‌లో – కొన్ని ఇస్లామిక్ పార్టీలు, ఢాకా విశ్వవిద్యాలయ కేంద్ర విద్యార్థి సంఘం నాయకులు నిరసనలు కొనసాగించారు. నిరసనలో “భారతదేశ ఏజెంట్లు, జాగ్రత్త”, “భారతీయ దురాక్రమణను ఆపండి” అనే నినాదాలు లేవనెత్తినట్లు ఢాకా బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య కార్యాలయాల చుట్టూ భద్రతను పెంచారు, దేశవ్యాప్తంగా కార్యకలాపాలను కాపాడటానికి సైన్యాన్ని మోహరించినట్లు సమాచారం.


