వాషింగ్టన్: ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి మాయమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను తిరిగి పునరుద్ధరించారు.
ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఎప్‌స్టీన్ డెస్క్ మీద ఉన్న ఒక ఫోటోలో ట్రంప్ ఒక మహిళా బృందంతో కలిసి ఉండగా, మరో ఫోటోలో తన భార్య మెలానియా, ఎప్‌స్టీన్, అతడి సహచరి గిస్లైన్ మాక్స్‌వెల్‌తో కలిసి ఉన్నారు. అయితే, ఈ ఫోటోలను న్యాయ శాఖ హఠాత్తుగా వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఆ ఫోటోను తాత్కాలింగా రివ్యూ కోసమే తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. కాగా, ఆ ఫోటోలో ఎప్స్టీన్ బాధితులు ఎవరూ లేరని పేర్కొంది.
జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో కేవలం ట్రంప్ ఫోటోలే కాకుండా, దాదాపు 16 కీలక ఫైల్స్ వెబ్‌సైట్ నుంచి కనిపించకుండా పోయాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వీటిలో ఎప్ స్టీన్ ఇంట్లోని కొన్ని అశ్లీల చిత్రాలు, ఎన్వలప్‌లతో నిండిన మెయిల్ స్లాట్‌లు, టైల్డ్ హాలు, పేర్లు, అపార్ట్‌మెంట్ నంబర్‌లతో కూడిన నోట్‌బుక్ పేజీ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఫోటోలను తొలగించడంపై డెమొక్రాట్లు నిప్పులు చెరిగారు. “డొనాల్డ్ ట్రంప్ తన గురించి లేదా తన కుటుంబం, స్నేహితుల గురించి బయటకు రాకూడదనుకునే విషయాలను కప్పిపుచ్చేందుకే ఇలా చేస్తున్నారు” అని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు జేమీ రాస్కిన్ ఆరోపించారు.
డెమోక్రాటిక్ సభ్యుల రాద్ధాంతంపై అమెరికా న్యాయ శాఖ స్పందించింది. బాధితుల గోప్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటోలను తాత్కాలికంగా తొలగించి సమీక్షించామని తెలిపింది. “ఆ ఫోటోలలో ఎప్‌స్టీన్ బాధితులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత, ఎటువంటి మార్పులు లేకుండా వాటిని మళ్లీ వెబ్‌సైట్‌లో ఉంచాం” అని న్యాయ శాఖ స్పష్టం చేసింది.
ఎప్‌స్టీన్ ఫైల్స్ స్కాండల్
ఇది 20 ఏళ్ల నాటి కేసు. 2005 మార్చిలో ఒక అమ్మాయి తరుపు కుటుంబం ఫిర్యాదుతో ఎప్ స్టీన్ లీలలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామ్ బీచ్ కౌంటీలోని తన నివాసంలో పలువురు రాజకీయనేతలతో సహా మిగతా ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ వ్యక్తి పలువురు బాలికలను వాడుకున్నాడని వారు ఆరోపించారు. జనాగ్రహం నేపథ్యంలో అరెస్టైన అతడు 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎప్ స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. దీంతో ఈ వివాదం బయటికొచ్చింది.


