హైదరాబాద్: తెలంగాణలో మూడవ దశలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ముందు, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనని ప్రవాస భారతీయులు (NRI’s) గందరగోళానికి గురవుతున్నారు. దేశంలోని తమ బంధువులు ఓటరు నమోదు ఫారమ్‌ను పూరించవచ్చా లేదా అనే దానిపై వారు అయోమయంలో ఉన్నారు.
హైదరాబాద్ ఎన్ఆర్ఐల ఆగమాగం
ఈమేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎన్ఆర్ఐ మాట్లాడుతూ…హైదరాబాద్‌లో ఓటర్లుగా నమోదు చేసుకుని, ఆ తర్వాత మెరుగైన అవకాశాల కోసం లేదా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. వారు మరో దేశ పౌరసత్వం తీసుకోనప్పటికీ, ఓటరుగా మారడానికి అర్హత ప్రమాణాలలో ఒకటైన భారతదేశ సాధారణ నివాసులు కారు.
చట్టం ప్రకారం… హైదరాబాద్, ఇతర భారతీయ జిల్లాల నుండి వచ్చిన ఎన్ఆర్ఐలు ‘ఫారం 6A’నింపి తమను తాము విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. వారు తమ పాస్‌పోర్ట్‌లో పేర్కొన్న చిరునామా ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదు చేసుకోవచ్చు.
అయితే, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఫారమ్‌లో …”ఓటరు లేదా ఏదైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం/ఎడమ బొటనవేలి ముద్ర ఉండాలని తేదీతో సహా” అని పేర్కొనడంతో గందరగోళం మొదలైంది.
ఇటీవల, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో, చాలా సంవత్సరాలుగా దుబాయ్, కువైట్‌లో నివసిస్తున్న తన ఇద్దరు కుమారుల తరపున ఒక మహిళ ఓటరు నమోదు ఫారాలను సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో ఒక కేసు నమోదైంది.
తరువాత, ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మీడియాతో మాట్లాడుతూ… ఎన్ఆర్ఐల ఓటరు నమోదు ఫారాలను వారి బంధువులు పూరించడానికి వీలులేదని చెప్పారు.
ఈమేరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిన్న బీఎల్‌ఓలో సమావేశంలో మాట్లాడుతూ… ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. బీహార్‌లో నిర్వహించిన భారీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందని సీఈసీ అన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలను వివరించారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య, జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వంటి వివరాలను ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డి, GHMC కమిషనర్ RV కర్ణన్, సీనియర్ డిప్యూటీ CEC పవన్ కుమార్ శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


