వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్‌లను అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్‌లో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌తో దొంగతనంగా సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను పట్టుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు ఎల్‌సాల్వడార్, చైనా, హైటి, మెక్సికో, రష్యా తదితర దేశాలకు చెందినవారు. వీరికి కాలిఫోర్నియా మొత్తం 31 వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసింది. ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 10, 11 తేదీల్లో ‘ఆపరేషన్ హైవే సెంటినెల్’ పేరుతో ఐసీఈ, హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థలతో కలిసి భారీ స్థాయి దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మరో 45 మంది అక్రమ వలసదారులు అరెస్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలోని ట్రక్కింగ్ కంపెనీలే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
ఇటీవల అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ట్రక్కులు నడుపుతూ చేసిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఈ చర్యలకు కారణమైంది. భారతీయ డ్రైవర్ల కారణంగా జరిగిన కొన్ని ప్రమాదాల్లో యువకులు, చిన్నారులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. “ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ సెమీ ట్రక్‌లు నడపకూడదు. ఈ ఇంటర్ ఏజెన్సీ ఆపరేషన్ ఉద్దేశ్యం వలస చట్ట ఉల్లంఘనలను అమలు చేయడం, US రహదారులను రక్షించడం, వాణిజ్య రవాణా రంగంలో నియంత్రణ ప్రమాణాలను సమర్థించడం అని CBP తెలిపింది. ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యం” అని ఎల్ సెంట్రో సెక్టర్ యాక్టింగ్ చీఫ్ స్పష్టం చేశారు.
“ఈ ఆపరేషన్ విజయం 2025కి ముందు మనం అనుభవించిన అపరిమిత సరిహద్దు సంక్షోభం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను హైలైట్ చేస్తుంది” అని ఎల్ సెంట్రో సెక్టార్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ జోసెఫ్ రెమెనార్ అన్నారు.


