న్యూఢిల్లీ: భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ‘బాహుబలి’ రాకెట్‌గా పేరొందిన అమెరికాకు చెందిన ‘బ్లూ బర్డ్ 2’ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. భారత్- అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం ఈరోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు.
24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత, రెండు S200 సాలిడ్ బూస్టర్‌ల మద్దతుతో 43.5 మీటర్ల పొడవైన రాకెట్ ఉదయం 8గంటల 55 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసింది. సుమారు 15 నిమిషాల ప్రయాణం తర్వాత, రాకెట్‌పై పిగ్గీబ్యాక్‌లో ప్రయాణించే అంతరిక్ష నౌక బ్లూబర్డ్ బ్లాక్-2 విడిపోయి దాదాపు 520 కి.మీ ఎత్తులో దాని ఉద్దేశించిన కక్ష్యకు చేరుకుంది.
బాహుబలి ప్రయోగం విజయవంతమయ్యాక ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ… శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. ఎల్బీఎం ప్రయోగాల్లో నూరు శాతం విజయాలు సాధిస్తున్నాం. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించాం. భారత భూమి నుంచి పైకెగసిన అతి భారీ రాకెట్ ఇదే. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని అన్నారు. అమెరికా కస్టమర్ కోసం దీన్ని చేపట్టాం. ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తోంది. గగన్యాన్ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి” అని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఉపగ్రహాన్ని AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే ఈ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. సుమారు 6.40 టన్నుల బరువు కలిగిన భారీ శాటిలైట్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన LVM3-M6 బాహుబలి రాకెట్ ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రయోగాన్ని “భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్‌లో ఇండియా స్థానాన్ని ఈ ప్రయోగం సుస్థిరం చేస్తుందని ప్రధాని అన్నారు.


