న్యూఢిల్లీ: క్రిస్మస్కు ముందు రోజు క్రైస్తవులపై జరిగిన దాడులను కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ శశి థరూర్ ప్రస్తావిస్తూ… “సంప్రదాయాలపై దాడి జరిగినప్పుడు, అది మనందరిపై జరిగినట్లే”నని వ్యాఖ్యానించారు. కేరళలోని పాలక్కాడ్‌లో క్రిస్మస్ గీతాలు పాడే బృందంపై దాడి జరిగిందని తిరువనంతపురం ఎంపీ పేర్కొంటూ… “మన క్రైస్తవ సోదరులతో సంఘీభావం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
“నా దృష్టిలో, ఈ సంఘీభావం చాలా ప్రాథమికమైనది. ఇప్పుడు ఒక క్లిష్టమైన సమయం నడుస్తోంది. దురదృష్టవశాత్తు, దేశంలోని వివిధ ప్రాంతాలలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. కేరళలో కూడా, పాలక్కాడ్‌లో క్రిస్మస్ గీతాలు పాడే బృందంపై దాడి జరిగింది, ఇది నిజంగా దిగ్భ్రాంతికరం,” అని నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన థరూర్ అన్నారు.
“మన సంప్రదాయాలపై దాడి జరిగినప్పుడు, కేవలం క్రైస్తవులపై మాత్రమే దాడి జరగదు, అది మనందరిపై జరిగినట్లే. ప్రతి భారతీయుడిపై దాడి జరిగినట్లే. మన రాజ్యాంగం కల్పించిన ఆరాధనా స్వేచ్ఛ, విశ్వాస స్వేచ్ఛపై దాడి జరుగుతోంది, మనమందరం మన క్రైస్తవ సోదరులతో సంఘీభావంగా నిలబడాలి,” అని ఆయన అన్నారు.
ప్రతి క్రిస్మస్ పండుగ ముందు రోజు తాను ఒక చర్చి నుండి మరొక చర్చికి వెళ్తానని, అయితే ఈసారి ఢిల్లీ నుండి తన విమానం ఆలస్యం కావడంతో కేవలం నాలుగు చర్చిలను మాత్రమే సందర్శించగలిగానని కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. కాగా,సెయింట్ జోసెఫ్ కేథడ్రల్‌లో అర్ధరాత్రి ప్రార్థనలో పాల్గొనడం ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైన అనుభూతి,” అని ఆయన అన్నారు.
“ఒక చర్చి నుండి మరొక చర్చికి వెళ్లడం నాకు ఒక అద్భుతమైన అనుభవం, ముఖ్యంగా సెయింట్ మేరీస్ చర్చిలో, సైరో-మలబార్ చర్చి ప్రధాన ఆర్చ్ బిషప్ అయిన కార్డినల్ క్లీమిస్, నన్ను వేదికపైకి పిలిచి, స్వయంగా నాకు ఒక చాక్లెట్ కేక్ ముక్క ఇచ్చి, కొన్ని మంచి మాటలు చెప్పారు,” అని ఆయన అన్నారు.
అన్ని వర్గాల సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించడం కేరళ రాజకీయాల ప్రత్యేకత. ” నేను ఇప్పుడు 17 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాను, నా నియోజకవర్గ సభ్యులతో సంఘీభావం చూపడం ప్రాథమికమైనది, కానీ అన్ని వర్గాల సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలను గౌరవించడం కూడా కేరళ రాజకీయాలకు కేంద్ర బిందువు,” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌లో, ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్, బజరంగ్ దళ్ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు తమ సంస్థలో క్రిస్మస్ వేడుకల విషయంలో విద్యార్థులను, సిబ్బందిని బెదిరించారని ఆయన ప్రస్తావించారు.
అలాగూ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో, బజరంగ్ దళ్ సభ్యులు సెయింట్ అల్ఫోన్సస్ కేథడ్రల్ చర్చి వెలుపల నిరసన ప్రదర్శన చేసి, ‘హనుమాన్ చాలీసా’ పఠించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే, కేంద్రంలో అధికారంలో ఉన్న “ఒక పార్టీ నాయకత్వం” ఈ దాడులను ఖండించాలని శశి థరూర్ కోరారు.
ఈ సందర్భంగా శశి థరూర్ భారతాన్ని ప్రస్తావించారు. “మహాభారతంలో, కౌరవ సభలో గురువులు, పెద్దలు, పాండవుల సమక్షంలో దుశ్శాసనుడు పాంచాలి మానభంగానికి ప్రయత్నించినప్పుడు, భీష్ముడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆ క్షణంలో, నిరసన గళం పాండవుల వైపు నుండి కాకుండా, కౌరవుల నుండే వినిపించింది. దుర్యోధనుడి సోదరుడైన వికర్ణుడు గళమెత్తి, ‘అన్నయ్యా దుర్యోధనా, ఇది అన్యాయం, ఇది అధర్మం’ అని అన్నాడు,” అని థరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “అధికార పార్టీ నేతల్లో ఎవరో ఒకరు ‘ఆపు, ఓ క్రూరుడా ‘ అని కూడా అంటారని ఎదురుచూస్తున్నాను,” అని శశి థరూర్ అన్నారు.


