లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 2.89 కోట్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని అధికారులు చెప్పారు.
ఎస్ఐఆర్ ముందు ఓటర్ల జాబితాలో 15.44 కోట్ల పేర్లు ఉండగా…తొలగింపు తర్వాత 12.55 కోట్లమంది ఉండే అవకాశం ఉంది. పేర్లు తొలగించిన వ్యక్తులు వచ్చే ఏడాది జనవరి 30లోగా అభ్యంతరాలను తెలపాలి. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత వారి పేర్లను తిరిగి చేర్చనున్నారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 28న ప్రచురిస్తారు. లక్నోలో అత్యధికంగా 12 లక్షల పేర్లు, ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో 11 లక్షలు, కాన్పూర్‌లో తొమ్మిది లక్షల పేర్లు తొలగించామని అధికారులు తెలిపారు.
ఆగ్రా, ఘజియాబాద్‌లోని ఓటర్ల జాబితాల నుండి కూడా సుమారు ఎనిమిది లక్షల పేర్లను తొలగించినట్లు వర్గాలు తెలిపాయి. వలసలు, నకిలీ ఓటర్లు, మరణాలు, జాడ తెలియని ఓటర్లు వంటి వివిధ కారణాల వల్ల పేర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. వలసల కారణంగానే అత్యధికంగా పేర్ల తొలగింపు జరిగిందని వారు చెప్పారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత అభ్యంతరాలను దాఖలు చేయాలని అధికారులు ప్రజలను కోరారు. 9.81 శాతం పేర్లు ‘అన్‌మ్యాప్డ్’ కేటగిరీలో ఉన్నాయని వారు చెప్పారు. ఈ ఓటర్లకు వారి గుర్తింపును నిర్ధారించడానికి అవసరమైన పత్రాలను సమర్పించాలని కమిషన్ నోటీసులు పంపుతుంది, ఆ తర్వాత వారిని ‘మ్యాప్డ్’ కేటగిరీకి మారుస్తారు.
ఈ ప్రక్రియ ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇది తమ మద్దతుదారుల పేర్లను తొలగించి, బీజేపీకి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. కేవలం అక్రమ వలసదారుల పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు పేర్కొంది.


