హైదరాబాద్: దక్కన్ సంస్కృతికి నిదర్శనమైన నాంపల్లి ఎగ్జిబిషన్ 85వ ఎడిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ నుమాయిష్ కోసం మొత్తం 1050 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, హస్తకళలను ప్రదర్శించే ఈ బృహత్తర ప్రదర్శన 46 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ప్రదర్శనను ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి
ఈ ఎగ్జిబిషన్‌ను జనవరి 1వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది ప్రతిరోజూ సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:30 వరకు, వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము రూ. 50గా నిర్ణయించగా, ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుంది.
34 ఉప కమిటీలు
ఈమేరకు జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…నాంపల్లిలో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ పర్యవేక్షణలో 34 ఉప కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. నుమాయిష్ ఆదాయంతో 19 విద్యా సంస్థలను నడుపుతున్నందుకు సొసైటీని ఆయన ప్రశంసించారు. దీనిని ప్రజా సేవలో ఒక ఆదర్శంగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుకేష్ రెడ్డి, కార్యదర్శి బిఎన్ రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ సంజీవ్ కుమార్, ప్రచార కన్వీనర్ సురేష్ కుమార్, సభ్యులు డాక్టర్ ప్రభా శంకర్, అష్ఫాక్ హైదర్, వినయ్ కుమార్, బి హన్మంత్ రావు, అనురాగ్ మిశ్రా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


