Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

త్రిపుర విద్యార్థి హత్యపై ‘సిట్’ ఏర్పాటు!

Share It:

అగర్తల: త్రిపుర విద్యార్థి అంజెల్ చక్మా ఉత్తరాఖండ్‌ రాజధానిలో హత్యకు గురికావడంపై దర్యాప్తు చేయడానికి డెహ్రాడూన్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో జాతి వివక్షకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు.

ఒక మద్యం దుకాణానికి గుంపుగా వచ్చిన వారి మధ్య జరుగుతున్న ‘పరిహాసాలను’ ఆ యువకుడు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈమేరకు డెహ్రాడూన్ ఎస్ఎస్‌పి అజయ్ సింగ్ మాట్లాడుతూ… అంజెల్‌ను కత్తితో పొడిచిన నేపాలీ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారని చెప్పారు.

“అంజెల్‌ను కత్తితో పొడిచిన ప్రధాన నిందితుడు (యజ్ఞరాజ్) అవస్థిని అరెస్టు చేసిన తర్వాతే ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి నిజం తెలుస్తుందని” ఆయన అన్నారు. ఈమేరకు సర్కిల్ ఆఫీసర్ హోదా అధికారి నాయకత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తును సిట్‌కు బదిలీ చేశామని, దీనివల్ల ఏ అంశమూ విస్మరించకుండా చూస్తారని ఆయన చెప్పారు.

ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా జరుగుతోందని, దొరికిన ఏ కొత్త సాక్ష్యాన్నైనా సక్రమంగా నమోదు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఈ సంఘటనకు జాతి వివక్ష కారణమని ఆపాదిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను పోలీసులు గమనించారని సింగ్ చెప్పారు. “మా దర్యాప్తులో ఇప్పటివరకు జాతి వివక్ష లేదా హింసకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు,” అని ఎస్ఎస్‌పి అన్నారు.

సంఘటన జరిగిన డిసెంబర్ 9వ తేదీ నుండి అంజెల్ మరణించిన డిసెంబర్ 26వ తేదీ వరకు… పోలీసులతో సంభాషణల సమయంలో జాతి వివక్షకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన చెప్పారు. ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో “జాతి వివక్ష ఆరోపణలు ఏవీ ప్రస్తావించలేదు” అని ఎస్ఎస్‌పి తెలిపారు.

ఫిర్యాదుదారుడు…తన సోదరులపై “కులం పేరుతో దూషణలు” చేశారని పేర్కొన్నప్పటికీ, దర్యాప్తులో “నిందితులలో ఇద్దరు స్వయంగా షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందినవారే” అని వెల్లడైంది.

సెలాక్వి ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలను అందిస్తూ… నిందితులలో ఒకరైన మణిపూర్ వాసి సూరజ్ ఖ్వాస్ డిసెంబర్ 9న ఒక పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేశారని సింగ్ చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రద్దీగా ఉన్న ప్రదేశంలో 40-50 సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మొత్తాన్ని పోలీసులు సేకరించారని సింగ్ తెలిపారు.

మృతుడు, అతని సోదరుడు ఒక వైపు, ఆరుగురు వ్యక్తులు మరో వైపుగా ఉన్న రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఎస్ఎస్‌పి చెప్పారు. ఈ గందరగోళంలో వివాదం ముదిరి ఘర్షణకు దారితీసిందని ఆయన అన్నారు.

“అక్కడ ఉన్న అతిథుల మధ్య కొంత సరదా సంభాషణ జరిగింది. బాధితుడి వర్గానికి కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా అనిపించడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత జరిగిన పోరాటంలో అంజెల్ చక్మా, అతని సోదరుడు మైఖేల్ చక్మా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజెల్ మరణించాడు” అని ఎస్ఎస్‌పి తెలిపారు. ఈ ఘటనలో అంజెల్‌కు వెన్నెముక,మెడకు ప్రాణాంతక గాయాలయ్యాయని ఆయన చెప్పారు.

నిందితుడికి, బాధితుడు ఒకరికొకరు తెలియదని, ఈ దాడి “ఆవేశంలో” జరిగిందని ఆ పోలీసు అధికారి అన్నారు. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. అంజెల్‌ను పొడవడానికి అవస్థి సమీపంలోని గుడ్ల బండి నుండి కత్తిని తీసుకున్నాడని, ఆ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్ఎస్‌పి తెలిపారు.

స్థానికుల వాంగ్మూలాలను నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీతో సహా డిజిటల్ ఆధారాలను సేకరించామని సింగ్ చెప్పారు. “ఇప్పటివరకు, నిందితులలో ఎవరైనా మృతుడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు వెలుగులోకి రాలేదు,” అని ఆయన అన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరుగురు నిందితులలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్‌పి తెలిపారు. వారిలో ఇద్దరు మైనర్లుగా తేలడంతో వారిని బాలల సంరక్షణ గృహానికి పంపగా, ముగ్గురు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరో నిందితుడు, నేపాల్ జాతీయుడైన యజ్ఞరాజ్ అవస్థి (22) పరారీలో ఉన్నాడు. ఇతను గతంలో హరిద్వార్, ఇతర ప్రాంతాలలో పనిచేశాడు.

పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయని, త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని సింగ్ చెప్పారు. అవస్థిపై ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటించిన రివార్డును రూ. 25,000 నుండి రూ.లక్షకు పెంచారని, నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని ఆయన తెలిపారు.

విద్యార్థులందరి భద్రత పోలీసుల బాధ్యత అని ఎస్ఎస్‌పి సింగ్ అన్నారు. దేశం నలుమూలల నుండి విద్యార్థులు డెహ్రాడూన్‌కు చదువుకోవడానికి వస్తారని, వారిలో ఈశాన్య రాష్ట్రాల నుండి 2000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు.

“కేవలం త్రిపుర నుండే సుమారు 250 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు… ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదు,” అని ఆయన అన్నారు. ఇక్కడి ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చివరి సంవత్సరం ఎంబీఏ చదువుతున్న అంజెల్ చక్మాపై డిసెంబర్ 9న కొందరు యువకులు కత్తి, బ్రాస్‌లెట్‌తో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 17 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మరణించాడు.

ఈమేరకు మణిపూర్‌లోని తంగ్జెంజ్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఒక బీఎస్‌ఎఫ్ జవాన్ అయిన హతుడి తండ్రి మాట్లాడుతూ… తన కొడుకుపై జాతి వివక్షాపూరిత దూషణలు చేస్తూ…అతన్ని ‘చైనీస్’ అని పిలవడంతో వారి నుండి తన సోదరుడిని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు తన కుమారుడు అంజెల్‌పై “క్రూరంగా దాడి జరిగిందని” ఆరోపించారు. దాడి చేసినవారు తన కుమారులను “చైనీస్ మోమో” అని పిలిచి, జాతి వివక్షాపూరిత దూషణలు చేశారని బాధితుడి తండ్రి పీటీఐకి ఫోన్‌లో తెలిపారు.

‘నేను చైనీయుడిని కాదు, భారతీయుడిని.’ ..ఇవీ వర్ణవివక్ష మూక దాడిలో ఈ నెల 9న డెహ్రాడూన్‌లో చనిపోయిన 24 ఏళ్ల త్రిపుర విద్యార్ధి ఏంజెల్‌ చక్మా చివరి మాటలు. స్థానికంగా ఏవో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలుచేయడానికి సోదరుడితో కలిసి వెళ్ళిన చక్మా అన్యాయంగా బలయ్యాడు. తనపై వర్ణవివక్ష వ్యాఖ్యలు చేస్తున్న కొంతమందిని వారించడానికి అతను చేసిన ప్రయత్నమే ప్రాణాలను బలిగొంది. రాడ్‌లు, కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపారు. వెన్నెముక, తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే చనిపోయారని డాక్టర్లు తేల్చారు. ఇందుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.