హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలను పునర్వ్యవస్థీకరించి… హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం 27 మునిసిపల్ పట్టణ సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో విలీనం చేసిన తర్వాత ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది. దీని ప్రకారం… గ్రేటర్ హైదరాబాద్ పరిధి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ), చందానగర్, చార్మినార్ మొదలైన అత్యంత భద్రతా ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలను చేర్చుకుంటూ విస్తరించింది.
కొత్త పోలీసు కమిషనర్లుగా సుధీర్ బాబు – ఫ్యూచర్ సిటీ , అవినాష్ మొహంతి – మల్కాజిగిరి, ఎం రమేష్ – సైబరాబాద్ పోలీసు, సజ్జనార్ – హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్లుగా నియమించింది.
కాగా, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిథిలో మొత్తం 73 పోలీసు స్టేషన్లు ఉండగా, సైబరాబాద్: 20, మల్కాజిగిరి: 30, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిథిలో 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మాదాపూర్ కొండాపూర్, రాజేంద్రనగర్ …సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. కాగా, హైదరాబాద్ సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ పోలీస్‌కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. ఇక శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మొయినాబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. అలాగే ఎల్బీనగర్, రాచకొండ,పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్, నాగోల్ మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిథిలోకి వస్తాయి.


