న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలు వేగంగా దెబ్బతిన్నందున జాసన్ మిల్లర్ (మాజీ ట్రంప్ సలహాదారు) నేతృత్వంలోని SHW పార్ట్నర్స్ LLC అనే సంస్థను మన దౌత్య మిషన్, భారత లాబీయిస్టుగా నియమించుకుంది. దీనికి గాను1.8 మిలియన్ డాలర్లు చెల్లిస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, ఈ లాబీయిస్టులు వాణిజ్యం, రక్షణ, దౌత్యపరమైన విషయాలలో అమెరికా ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో భారతదేశ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి కీలక పాత్ర పోషిస్తారు.
అంతేకాదు అమెరికా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, విధానాలపై సలహాలు ఇవ్వడం, సంబంధాలను మెరుగుపరచడం వంటి పనులు చేస్తారు. ఇది అమెరికాలో చట్టపరమైన పద్ధతి అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. మొత్తంగా అన్ని దౌత్య సంబంధాలను నెరపడానికి ఒక లాబీయింగ్ సంస్థకు అవుట్సోర్స్ చేసిందని తెలుస్తోంది.
మిల్లర్ సంస్థ…యుఎస్ ప్రభుత్వ అధికారుల మధ్య, క్యాబినెట్ సెక్రటరీల నుండి వైట్ హౌస్ చీఫ్‌ల నుండి ఫాక్స్ న్యూస్ యాంకర్ల వరకు కనీసం 60 వరకు పరిచయాలు చేసుకున్నట్లు జనవరి 4న Xలో పోస్ట్ చేశారు.
భారతదేశం ఇప్పటివరకు మిల్లర్ సంస్థకు ఆరు నెలల పని కోసం US $900,000 చెల్లించింది, 2025లో ఏప్రిల్ 2, జూలై 28న ఒక్కొక్కటి US $450,000 చొప్పున రెండు సార్లు చెల్లింపులు చేసింది. మొత్తం ఒప్పందం సంవత్సరానికి US $1.8 మిలియన్లు.
మిల్లర్ సీనియర్ కమ్యూనికేషన్ సలహాదారు, ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రముఖ ప్రతినిధి, తరువాత 2020, 2024 ఎన్నికల ప్రచారాలలో ట్రంప్‌కు సీనియర్ సలహాదారుగా పనిచేశాడు. జనవరి 2025లో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత… భారత ప్రభుత్వం తన లాబీయిస్ట్‌గా మిల్లర్‌ను నియమించుకుంది.
ఏప్రిల్ 24, 2025న ప్రారంభమైన ఈ నియామకం ఒక కీలకమైన సమయంలో వచ్చింది. అంతకు రెండు రోజుల ముందు… ఏప్రిల్ 22న, ఉగ్రవాదులు కాశ్మీర్‌లోని పహల్గామ్లోని ఒక పర్యాటక ప్రదేశంపై దాడి చేసి కనీసం 26 మందిని చంపారు. పాకిస్తాన్ దీనికి సహకరించిందని భారతదేశం ఆరోపించింది. ఉపాధ్యక్షుడు J.D. వాన్స్ మరుసటి రోజు భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది.
ఆ కీలక సమయంలో మిల్లర్ నేతృత్వంలోని SHW లాబీయింగ్ సంస్థ…భారత దౌత్యవేత్తల కోసం సమావేశాలను ఏర్పాటు చేయడం గురించి సీనియర్ US అధికారులకు కనీసం నాలుగు డాక్యుమెంట్ కాల్స్ చేసింది. తదుపరి మే 7న, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారతదేశం దాడి చేసినప్పుడు…ఫాక్స్ న్యూస్‌లోని ప్రముఖ యాంకర్‌కు ఒక కాల్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత SHW పార్టనర్స్ సీనియర్ అమెరికన్ అధికారులతో అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. జాతీయ భద్రతా మండలి డైరెక్టర్ రికీ గిల్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్, USTR గ్రీర్లకు మిల్లర్ SHW లాబీయింగ్ సంస్థ ఫోన్ కాల్స్ చేసింది.
అంతేకాదు గత జూన్ 2025లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌తో సమావేశం కావాల్సినప్పుడు, ఆ అభ్యర్థన భారత రాయబారి ద్వారా రాలేదు. బహుళ పార్టీల ప్రతినిధి బృందం అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలను కలవాలనుకున్నప్పుడు, భారత దౌత్యవేత్తలు కాల్స్ చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డోనాల్డ్ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు, దానిని అమెరికా అధ్యక్షుడి కమ్యూనికేషన్ బృందానికి తెలియజేసింది ఎంబసీ సిబ్బంది కాదు. SHW పార్టనర్స్ LLC అనే చిన్న ఆర్లింగ్టన్ లాబీయింగ్ సంస్థ మాత్రమే అని మనం తెలుసుకోవాలి.


