న్యూఢిల్లీ: సరైన అధారాలు లేకుండానే తన భర్తను నిర్బంధించారని జైలులో ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో నిన్న సుప్రీంకోర్టుకు తెలిపారు. నిర్బంధ అధికారి చెబుతున్న నాలుగు వీడియోలను వాంగ్చుక్కు అందించలేదని, ఇది అతని హక్కును ఉల్లంఘించడమేనని ఆమె కోర్టుకు తెలిపారు.
ఆంగ్మో తరపున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, జస్టిస్‌లు అరవింద్ కుమార్, ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనానికి వీడియోలను అందించకపోవడంతో… సలహా మండలి ముందు, అలాగే ప్రభుత్వం ముందు సమర్థవంతమైన ప్రాతినిధ్యం పొందే వాంగ్‌చుక్ హక్కును ఉల్లంఘించిందని తెలిపారు.
వాంగ్చుక్ను నిర్బంధించాలని సిఫార్సు చేసేటప్పుడు జిల్లా మేజిస్ట్రేట్ తన విచక్షణను ఉపయోగించలేదని, కేవలం లడఖ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) చేసిన సిఫార్సులను “కాపీ-పేస్ట్” చేశారని సిబల్ వాదించారు. “నిర్బంధానికి గల కారణాలు కేవలం సిఫార్సుల కాపీ-పేస్ట్ మాత్రమే. ఆధారపడిన సాక్ష్యాలకు నిర్బంధ ఉత్తర్వుతో ప్రత్యక్ష సంబంధం ఉండాలి. నిర్బంధం కోసం అసంబద్ధమైన విషయాలపై ఆధారపడ్డారని” సిబల్ అన్నారు. నిన్న ఈ కేసు విచారణ అసంపూర్తిగా ముగిసింది, నేడు కూడా కొనసాగుతుంది.
తన భర్త లేహ్‌లో చేసిన ప్రసంగం ఉద్దేశం… హింసను ప్రేరేపించడం కాదని, దానిని అణచివేయడమేనని, అతన్ని నేరస్థుడిగా చిత్రీకరించడానికి వాస్తవాలను తారుమారు చేస్తున్నారని ఆంగ్మో గతంలో పేర్కొన్నారు. వాంగ్చుక్కు అతని నిర్బంధానికి సంబంధించిన “పూర్తి కారణాలు” అందించలేదని, ఈ చర్యకు వ్యతిరేకంగా సంబంధిత అధికారికి విన్నవించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని కూడా ఆంగ్మో కోర్టుకు తెలిపారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ హోదా కోరుతూ జరిగిన హింసాత్మక నిరసనలలో నలుగురు మరణించి, కేంద్రపాలిత ప్రాంతంలో 90 మంది గాయపడిన రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 26, 2025న వాంగ్చుక్ను కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించారు. “భారతదేశ రక్షణకు హాని కలిగించే” విధంగా ప్రవర్తించకుండా వ్యక్తులను నిరోధించడానికి కేంద్రం,రాష్ట్రాలకు NSA అధికారం ఇస్తుంది. గరిష్ట నిర్బంధ కాలం 12 నెలలు, అయితే దీనిని ముందుగానే రద్దు చేయవచ్చు.
వాంగ్‌చుక్ దేశ భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు,నిత్యావసర సేవలకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడ్డారని, దీనివల్లనే అతన్ని NSA కింద నిర్బంధించారని లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) గతంలో సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో, వాంగ్చుక్ను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని లేదా నిర్బంధంలో అతనితో అనుచితంగా వ్యవహరించారని డిఎం ఖండించారు. అతని నిర్బంధానికి గల కారణాలను అతనికి తెలియజేసినట్లు సమర్పించారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 24న లేహ్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనలను వాంగ్‌చుక్ చర్యలు లేదా ప్రకటనలకు ఏ విధంగానూ ఆపాదించలేమని ఆంగ్మో తన పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు వాంగ్‌చుక్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హింసను ఖండించారు. ఇది లడఖ్ ఐదు సంవత్సరాల శాంతియుత ప్రయత్నం విఫలమవడానికి దారితీస్తుందని …ఇది వాంగ్‌చుక్ జీవితంలో అత్యంత విచారకరమైన రోజు అని ఆంగ్మో అన్నారు.


