హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కీలక అడుగు పడింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డులు, చైర్‌పర్సన్లు/మేయర్ల పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), వెనుకబడిన తరగతులు (బీసీలు), మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు, ఎస్టీలకు, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 10 మేయర్ల పదవులలో నాలుగు మహిళలకు రిజర్వ్ చేసారు. బీసీ వర్గాలకు మొత్తం మూడు కార్పొరేషన్లు కేటాయించగా.. అందులో రెండు జనరల్, ఒకటి మహిళలకు కేటాయించారు. ఇక అన్‌రిజర్వుడ్ (ఓసీ) విభాగంలో ఐదు నగరాలను కేటాయించగా.. అందులో నాలుగు నగరాలను మహిళలకే కేటాయించడం విశేషం. ఎస్సీలు, ఎస్టీలకు చెరొక పోస్టును రిజర్వ్ చేశారు. ఒక సీటు జనరల్‌గా ఉంటుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లోని 300 వార్డులలో, 61 బీసీ మహిళలకు సహా 122 వార్డులు బీసీలకు రిజర్వ్ చేశారు. మరో 76 సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. జనరల్ వార్డుల సంఖ్య 74. ఐదు సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. కాగా, ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు, 23 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఇందులో 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా GHMCలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల 27 పట్టణ స్థానిక సంస్థలను GHMCలో విలీనం చేసి వార్డుల సంఖ్యను 300కి రెట్టింపు చేసిన విషయం తెలిసిందే.
కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లకు కూడా వార్డుల రిజర్వేషన్ ఖరారు చేశారు. ఇక 121 మున్సిపాలిటీల విషయానికి వస్తే, ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు కేటాయించారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు, 30 జనరల్ విభాగాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ 118 మునిసిపాలిటీలు, ఐదు మునిసిపల్ కార్పొరేషన్లకు ఓటరు జాబితాను తాజాగా ప్రచురించింది. ఈ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాగా, GHMCతో సహా మూడు మునిసిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లకు కమిషన్ ఇంకా ఓటరు జాబితాను ప్రచురించలేదు. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది.


