హైదరాబాద్: పాతబస్తీ పురానాపుల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హింసాకాండపై జమాతే-ఇ-ఇస్లామి హింద్, గ్రేటర్ హైదరాబాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఆలయ విధ్వంసం జరిగినట్టు వచ్చిన వదంతులు మత ఘర్షణలకు దారితీసాయి. ఇటువంటి సంఘటనలు నగరంలో సామాజిక సామరస్యాన్ని “తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి”, వాటిని తీవ్రంగా ఖండించాలి అని ఆ సంస్థ నొక్కి చెప్పింది.
ప్రార్థనా స్థలంపై దాడి జరిగిందనే తప్పుడు పుకార్ల వల్ల అశాంతి చెలరేగిందని జమాతే-ఇ-ఇస్లామి హింద్ హైదరాబాద్ నగర అధ్యక్షులు ముబాషిర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ తప్పుడు సమాచారం అనవసరమైన ఉద్రిక్తతను సృష్టించింది, దీనిని కొంతమంది దుండగులు ప్రజా ఆస్తులను దెబ్బతీసేందుకు,అమాయక వ్యక్తులపై దాడి చేయడానికి ఉపయోగించుకున్నారు. ఈ ప్రవర్తనను “పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు హైదరాబాద్ శాంతియుత ప్రతిష్టకు హానికరం” అని ముబష్షిర్ అహమ్మద్ పేర్కొన్నారు.
భద్రతా దళాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో అల్లర్లు కొనసాగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని నిర్వహించడంలో స్పష్టంగా కనిపించే లోపాలను క్షుణ్ణంగా సమీక్షించాలని, పునరావృతం కాకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.
ఈమేరకు జమాతే-ఇ-ఇస్లామి హింద్… నిందితులను గుర్తించడం, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే హింసలో పాల్గొన్న వారందరిపై నిష్పాక్షికమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఆస్తి నష్టం వాటిల్లిన వారికి తక్షణ పరిహారం అందించాలంది. ఇక ఉద్రిక్తతను నివారించడానికి సున్నితమైన ప్రాంతాలలో నిఘా పెంచి… తగినన్ని భద్రతా దళాలను మోహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
అంతేకాదు ప్రజలు… ముఖ్యంగా యువత, పుకార్లకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నగరంలో శాంతిని పునరుద్ధరించడానికిచేసే అన్ని ప్రయత్నాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలనిజమాతే-ఇ-ఇస్లామి నగర అధ్యక్షులు ముబష్షిర్ అహ్మద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, పురానాపూల్ ప్రాంతంలో మత సామరస్యాన్ని కాపాడటానికి, పౌరులందరికీ న్యాయం అందించడానికి తన నిబద్ధతను జమాతే-ఇ-ఇస్లామీ హింద్ పునరుద్ఘాటించింది.


