ముంబై: దాదాపు మూడు దశాబ్దాల పాటు అవిభక్త శివసేన ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ, భారతీయ జనతా పార్టీబృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే పూణేలో కూడా విజయం సాధించింది, అక్కడ శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గాల కూటమిని చిత్తు చేసింది.
మొత్తం మీద, జనవరి 15న ఎన్నికలు జరిగిన ముంబైతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి రాబోతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సాయంత్రం దక్షిణ ముంబైలో ఉత్సాహంగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం డేటా ప్రకారం…నవీ ముంబైలోని 111 సీట్లలో బీజేపీ 65 స్థానాలను గెలుచుకుంది. శివసేన 43, శివసేన (యూబీటీ) రెండు సీట్లు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
జల్గావ్లో బీజేపీ 75 సీట్లలో 46, శివసేన 22, ఎన్సీపీ ఒకటి, శివసేన (యూబీటీ) ఐదు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.
సాంగ్లీ-మిరాజ్-కుప్వాడలో, బీజేపీ 78 సీట్లలో 39, కాంగ్రెస్ 18, ఎన్సీపీ 16, శివసేన రెండు, ఎన్సీపీ (ఎస్పీ) మూడు స్థానాలను గెలుచుకున్నాయి.
జల్నాలో 65 సీట్లలో… బీజేపీ 45, కాంగ్రెస్ తొమ్మిది, శివసేన 12, ఇతరులు మూడు స్థానాలను గెలుచుకున్నారు.
థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో, బీజేపీ 78 సీట్లలో 37 స్థానాలను గెలుచుకోగా, శివసేన 36 స్థానాలను గెలుచుకుంది.
90 మంది సభ్యులున్న భివండి-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో, కాంగ్రెస్ 30, బీజేపీ 22 స్థానాలను గెలుచుకున్నాయి. శివసేన, ఎన్‌సిపి (ఎస్పి) రెండూ చెరో 12 స్థానాలను గెలుచుకున్నాయి.
పన్వెల్‌లో మొత్తం 78 స్థానాలకు గాను బీజేపీ 55, కాంగ్రెస్ నాలుగు, శివసేన రెండు, శివసేన (యూబీటీ) ఐదు, ఇతరులు 10 స్థానాలను గెలుచుకున్నారు.
మాలేగావ్‌లో మొత్తం 84 స్థానాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) 26, శివసేన 18, బీజేపీ రెండు స్థానాలను గెలుచుకోగా, ఇతరులు 35 స్థానాలను కైవసం చేసుకున్నారు.
ధూలేలో బీజేపీ 50 స్థానాలు, ఎన్‌సిపి ఎనిమిది, శివసేన ఐదు మరియు ఇతర పార్టీలు 11 స్థానాలను గెలుచుకున్నాయి.
అహల్యానగర్‌లో, మొత్తం 68 స్థానాలకు గాను ఎన్‌సిపి 27, బీజేపీ 25, కాంగ్రెస్ రెండు, బీఎస్పీ ఒకటి, శివసేన 10, శివసేన (యూబీటీ) ఒకటి మరియు ఇతరులు రెండు స్థానాలను గెలుచుకున్నారు.
కొల్హాపూర్‌లో కాంగ్రెస్ 34 స్థానాలు, బీజేపీ 26, శివసేన 15, ఎన్‌సిపి నాలుగు, శివసేన (యూబీటీ) ఒకటి మరియు ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు.
కాగా, మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్రపక్షాల ఘన విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. “ధన్యవాదాలు మహారాష్ట్ర! రాష్ట్రంలోని చైతన్యవంతమైన ప్రజలు ప్రజల అనుకూల సుపరిపాలన అనే ఎన్‌డిఎ అజెండాను ఆశీర్వదించారు,” అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బీజేపీ నేతృత్వంలోని కూటమి 227 మంది సభ్యులున్న బీఎంసీలో 114 స్థానాల మెజారిటీ మార్కును అధిగమించే దిశగా ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక పౌర సంస్థ, దీని 2025-26 బడ్జెట్ ఏకంగా రూ. 74,427 కోట్లు. ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన మంచి పనితీరు కనబరచడంతో, ముంబై పౌర సంస్థను పాలించే విషయంలో బీజేపీ ఇప్పుడు ముందంజలో ఉంది.
బీఎంసీ కోసం జరిగిన ఈ హోరాహోరీ పోరులో రెండు దశాబ్దాల తర్వాత థాకరేలు తిరిగి కలిశారు, అయితే ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలు వారి ఆశలను వమ్ము చేశాయి. పుణె , పొరుగున ఉన్న పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో, బీజేపీ-ఎన్సీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.
కాగా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఈ విజయానికి కేంద్రంగా నిలిచారు. ఆయన నాయకత్వంలో బీజేపీ 2017 బీఎంసీ ఎన్నికలలో సాధించిన 82 సీట్ల మునుపటి అత్యధిక సంఖ్యను అధిగమించింది. అంతేకాదు బీజేపీ “మిషన్ ముంబై” విజయం ఇప్పుడు దానిని ఆర్థిక రాజధానిలో కీలక రాజకీయ శక్తిగా సుస్థిరం చేసింది.
ఈ ఫలితం ముంబై అధికార స్వరూపంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. చాలా సంవత్సరాలుగా, బీఎంసీ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అజేయమైన కోటగా పరిగణించేవారు. ఇప్పుడు బీజేపీ విజయంతో, ముంబై రాజకీయాల కథనం సాంప్రదాయ గుర్తింపు ఆధారిత “మరాఠీ అస్మిత” నుండి బీజేపీ “వికాస్” నినాదానికి ప్రజామోదం లభించనట్టైంది.
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి బలమైన ప్రదర్శన కనబరచడం, ప్రచార సమయంలో తాము లేవనెత్తిన హిందుత్వ నినాదానికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు నితీష్ రాణే అన్నారు. “హిందుత్వం ఎల్లప్పుడూ మా ఆత్మ; మా హిందుత్వాన్ని అభివృద్ధి నుండి వేరు చేయలేరు,” అని ఫడ్నవీస్ అన్నారు. మరోవంక 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పాంగర్కర్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
ముఖ్యమంత్రి ఫడ్నవీస్,కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల సొంత నియోజకవర్గమైన నాగపూర్‌లో ఓట్ల లెక్కింపు సరళి, ఫలితాలు 2017 ఫలితాలను దాదాపుగా పునరావృతం చేస్తున్నట్లు సూచించాయి. దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ గణనీయమైన పురోగతి సాధించడానికి ఇబ్బంది పడింది.
151 మంది సభ్యులున్న నాగపూర్ పౌర సంస్థలో బీజేపీ 2017లో సాధించిన 108 సీట్ల సంఖ్యను అధిగమించే దిశగా పయనిస్తోంది. వంచిత్ బహుజన్ ఆఘాడీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ, లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి, 70 మంది సభ్యులున్న సంస్థలో 40కి పైగా సీట్లతో స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది, బీజేపీ చాలా వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది.


