అబ్దుల్ మజీద్ షోయిబ్,
అధ్యక్షులు, ఎం.పి.జే తెలంగాణ.
ఎస్ఐఆర్పై ప్రజా ప్రతిఘటన అవసరం
హైదరాబాద్: ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియ వల్ల కోట్లాది పౌరుల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో పేదలు, కూలీలు, మైనారిటీలు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాల వారు ప్రభావితమయ్యారు.
ఎస్ఐఆర్ కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు — ఇది రాజకీయంగా ప్రభావం చూపే చర్య. దీనిపై మౌనంగా ఉండటం ఆత్మహత్యతో సమానం. కోట్ల మంది ఓటర్ల తొలగింపు దేశంలో ఒక తీవ్రమైన జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంది. దీని పరిణామాలు ఎంత వరకు వెళ్తాయో ఇప్పుడే పూర్తిగా అంచనా వేయడం సాధ్యం కాదు.
ఎస్ఐఆర్ సమయంలో ఇలా జరిగింది ఇదే:
• ఇంట్లో కనిపించకపోతే “గైర్హాజరు”గా పరిగణించడం
• తాత్కాలిక వలసను “అర్హతలేని ఓటర్”గా ప్రకటించడం
• గణనపత్రాల చిన్నపాటి లోపాన్నే పేరు తొలగింపుకు కారణంగా తీసుకోవడం
ఇవి అన్నీ రాజ్యాంగం ఓటు హక్కును మౌలిక హక్కుగా గుర్తించినప్పటికీ జరిగాయి. ప్రజల ఈ హక్కును కాపాడటం దేశం బాధ్యత. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఒకేసారి కోట్లాది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) లాంటిది… సాధారణ పరిపాలనా ప్రక్రియ కాదు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో BLO’s (బూత్ లెవల్ ఆఫీసర్లు) కు ఇచ్చిన అధికారాలు కొన్నిచోట్ల దుర్వినియోగానికి దారి తీశాయి. దేశమంతటా ఒకే రకమైన ఫిర్యాదులు వినిపిస్తున్నాయి:
• ఓటర్ని కలవకుండానే ఫారమ్‌లు నమోదు చేయడం
•పొరుగువారి మాటల ఆధారంగా “మారిపోయారు/వేరే చోటికి వెళ్లారని” నమోదు చేయడం
• పేరు, వయస్సు, చిరునామా, బంధుత్వ వివరాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేయడం
• డిజిటల్ ఫారమ్‌లు ఎవరో భర్తీ చేసి, సంతకాలు నకిలీగా పెట్టడం
•కొన్నిచోట్ల అసలు BLOకి తన పేరుతో ఎవరో ఫారమ్‌లు పెట్టిన విషయం కూడా తెలియకపోవడం
ఇవి ఒక్కో వ్యక్తి చేసిన పొరపాట్లు మాత్రమే కావు — ఇది ఒక క్రమబద్ధమైన చర్యకు సంకేతం. ఇది కేవలం అశక్తత కాదు — ఆలోచించి చేసిన రాజకీయ దాడి.
ఈ ప్రక్రియ వల్ల కొన్ని ప్రత్యేక వర్గాలు అత్యధికంగా ప్రభావితమవుతున్నాయి — వీరే ఇప్పటికే రాజకీయ శక్తి తక్కువగా ఉన్నవారు. ఇది ప్రజా ప్రతినిధిత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా ఎన్నికల ఫలితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎస్ఐఆర్ ఒక రకంగా ప్రజలను ఓటు హక్కు నుంచి మౌనంగా దూరం చేసే ప్రక్రియగా మారుతోంది.
ఎస్ఐఆర్లో మరో అత్యంత ప్రమాదకర విషయం ఏమిటంటే…. ఓటర్ల నుంచి పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు కోరడం. ఇది ఎలక్షన్ కమిషన్ అధికార పరిధికి బయట విషయం. ఎలక్షన్ కమిషన్ పని ప్రజలకు ఓటు హక్కు కల్పించడం, ఎవరూ ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం కాకుండా చూడడం. కానీ ఎస్ఐఆర్ వివరాలు చూస్తే, దీని ముసుగులో ప్రజలను పౌరసత్వ ఆధారాలు చూపించమని అడుగుతున్నట్టు తెలుస్తోంది.
ఎస్ఐఆర్పై ప్రజా వ్యతిరేకత అవసరం. ప్రజలు మౌనంగా ఉంటే…
• ఇది “సాధారణ ప్రక్రియ”గా మార్చేస్తారు
• ప్రతి ఎన్నికల ముందు “ఓటర్ లిస్ట్ ప్రక్షాళన” పేరుతో ముందుగా తొలగింపులు చేస్తారు
• తరువాత తొలగించిన వారి పౌరసత్వాన్ని అనుమానాస్పదంగా చేస్తారు
• ఆ ఆధారంగా వారికి ఇతర హక్కులు కూడా దశలవారీగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది
రాబోయే రోజుల్లో ఓటు హక్కు… హక్కు కాకుండా ఒక “ప్రివిలేజ్/దయ”గా మారిపోయే పరిస్థితి వస్తుంది. సో…
మనమిప్పుడే మొదటి దశలోనే ఎస్ఐఆర్ విధానాన్ని సవాల్ చేయాలి.
పేర్లు తొలగించే ముందు నుంచే సామూహిక నిరసన, న్యాయ, రాజ్యాంగ ఒత్తిడి సృష్టించాలి.
మీడియా, సివిల్ సొసైటీని కూడా చైతన్యపరచడం అవసరం.
ఇది కేవలం ఓటర్ జాబితా సమస్య కాదు — పౌరుడిగా ఉండే హక్కుపై ప్రశ్న
అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిదేమిటంటే…
•మౌనం నేరం — ప్రతిఘటన విధి.
•ఎస్ఐఆర్ పారదర్శకతకంటే తొలగింపుకు సాధనంగా మారితే,
•BLOలు జవాబుదారీగా లేకపోతే,
•కోట్లాది మంది వినిపించుకోకుండా హక్కు కోల్పోతే —
అలాంటి పరిస్థితిలో నిష్పక్షపాతంగా మౌనంగా ఉండటం అన్యాయానికి తోడ్పడటమే అవుతుంది.
అందుకే ఎస్ఐఆర్ విషయంలో:
• ప్రజలు సంఘటితం కావాలి
• ప్రశ్నలు అడగాలి
• వ్యతిరేకించాలి
• ఓటు హక్కునే కాదు, పౌరుడిగా ఉండే హక్కును కూడా రక్షించాలి


