Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తమిళనాడు అసెంబ్లీలో ఘర్షణ…గవర్నర్ ఆర్.ఎన్. రవి వాకౌట్!

Share It:

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి, డీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. శాసనసభ ప్రారంభ సమావేశంలో సిద్ధం చేసిన ప్రసంగానికి భిన్నంగా…గవర్నర్ ప్రసంగించాలని తీసుకున్న నిర్ణయం ఈ రగడకు కారణమైంది.

ఉదయం అసెంబ్లీ సెషన్‌‌ ప్రారంభం కాగానే రాజకీయ రగడ రాచుకుంది. శాసన సభను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేసి, అందరూ ఆలపించాలని అసెంబ్లీ స్పీకర్ అప్పారావుకు గవర్నర్ సూచించారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. కాగా, తమిళనాడు సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గీతం ఆలపించి, సభ ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఈ విషయంలో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. దీంతో అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారు.

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ…రాష్ట్ర అసెంబ్లీ సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగించాలనే సంప్రదాయానికి తూట్లు పొడిచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాల్సి ఉంటుందని, అందులో ఆయన అభిప్రాయాలను చేర్చే అవకాశమే ఉండదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రసంగంలోకి గవర్నర్ అభిప్రాయాన్ని చేర్చేలా అసెంబ్లీ రూల్స్ ఏవీ లేవన్నారు. ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే గత కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఈవిధంగా చేయడం రాష్ట్ర అసెంబ్లీని అవమానించడమే అవుతుందన్నారు.

కాగా, సభలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సభలో పదేపదే గవర్నర్ ఆర్‌ఎన్ రవి మైక్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. ఆయనను మాట్లాడనివ్వలేదు. దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగిక హింసాకాండ వంటి వ్యవహారాలను గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చలేదు’ అని గవర్నర్ కార్యాలయం విమర్శించింది. అందుకే గవర్నర్‌ ప్రసంగించేందుకు నిరాకరించారని ఆ ప్రకటన స్పష్టం చేసింది.

ఈ పరిణామం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176పై, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో గవర్నర్ పాత్రపై జరుగుతున్న చర్చను హైలైట్ చేస్తుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సంఘర్షణ ఇరుపక్షాలకు రాజకీయ వ్యూహంగా ఉపయోగపడవచ్చునని విశ్లేషకులు సూచిస్తున్నారు, అయితే గవర్నర్ కేవలం లాంఛనప్రాయ అధిపతిగా కాకుండా రాజకీయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.