చెన్నై: ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజిన్’ వ్యాఖ్యలపై సీఎం స్ఠాలిన్ విరుచుకుపడ్డారు. అది తమిళనాడులో నడవదని ఆయన అన్నారు.
మధురాంతకంలోని శివారు ప్రాంతంలో జరిగిన ఎన్డీఏ రాజకీయ సభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని “డమ్మీ ఇంజిన్” అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రవేశించని తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎలా అభివృద్ధిని సాధిస్తున్నాయో ఆలోచించాలని మోడీని కోరారు.
తమిళనాడులో ఎన్డీఏ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి… రాష్ట్రంలోని అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు.”మనం తమిళనాడును డీఎంకే పట్టు నుండి విముక్తి చేయాలి” అని అన్నారు. తమిళనాడు అభివృద్ధి, పురోగతి కోసం కేంద్రంతో “భుజం భుజం కలిపి” నడిచే “డబుల్ ఇంజిన్” ప్రభుత్వానికి రాష్ట్రంలో మద్దతు పలకాలని ప్రజలకు సూచించారు.
“ప్రధానమంత్రి చెప్పే డబుల్ ఇంజిన్ తమిళనాడులో నడవదు… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సృష్టించిన అన్ని అడ్డంకులను అధిగమించి తమిళనాడు చారిత్రాత్మక వృద్ధిని సాధించింది,” అని స్టాలిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో అన్నారు.
ఒక్క క్షణం ఆలోచించండి… మీరు మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి “డబుల్ ఇంజిన్” రాష్ట్రాల కంటే… మీ “డమ్మీ ఇంజిన్” ప్రవేశించని తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అభివృద్ధిని సాధిస్తున్నాయని” స్టాలిన్ అన్నారు.
తమిళులకు, తమిళనాడుకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన “ద్రోహాలను” ప్రధానమంత్రి దాచిపెట్టినా…రాష్ట్ర ప్రజలు వాటిని ఎప్పటికీ మర్చిపోరు. “తమిళనాడు ఢిల్లీ అహంకారానికి తలవంచదని” స్టాలిన్ ఆ పోస్ట్‌లో అన్నారు.



