Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

కుల గణనపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించిన కాంగ్రెస్ !

Share It:

న్యూఢిల్లీ: రాబోయే 2027 జనాభా లెక్కల్లో సమగ్ర కుల గణనకు మోడీ ప్రభుత్వం పూనుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ షెడ్యూల్ (ఫేజ్ 1)లోని 12వ ప్రశ్న ఇంటి యజమాని షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) లేదా ‘ఇతర’ వర్గాలకు చెందినవాడా అని మాత్రమే అడుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు.

ఇంటింటి సర్వేలో కులం గురించిన ప్రశ్నలు సమగ్రంగా లేవని, OBC, జనరల్ వర్గాలను పూర్తిగా కవర్ చేయడం లేదని ఆయన అన్నారు. సమగ్ర కుల గణన కోసం విపక్షాలు, సివిల్ సొసైటీతో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జనాభా లెక్కల సేకరణలో కుల గణనను చేర్చుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇది ఇతర వెనుకబడిన తరగతులు (OBC) లేదా జనరల్ వర్గాలను స్పష్టంగా ప్రస్తావించలేదు.

కుల ఆధారిత డేటాను తారుమారు చేయడం వల్ల సామాజిక, ఆర్థిక పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ హెచ్చరించింది. బీహార్ మరియు ఇతర రాష్ట్రాల ఒత్తిడి, రాహుల్ గాంధీ డిమాండ్ల నేపథ్యంలో జనాభా లెక్కల్లో కులగణన చేర్చాలని కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

గతంలో కుల గణన డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రధాని, ఇప్పుడు దానికి అంగీకరించడం కాంగ్రెస్ సాధించిన నైతిక విజయమని ఆయన పేర్కొన్నారు. “2024 ఏప్రిల్ 28న ఒక ఇంటర్వ్యూలో కుల గణనను డిమాండ్ చేసేవారిని ‘అర్బన్ నక్సల్స్’గా ప్రధాని అభివర్ణించారు. కానీ, చివరకు ఆ డిమాండ్‌కే ఆయన తలవంచాల్సి వచ్చింది” అని జైరాం రమేశ్​ గుర్తుచేశారు. 2021లో పార్లమెంటులో, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ద్వారా కుల గణనను తోసిపుచ్చిన మోదీ ప్రభుత్వం, 2025 ఏప్రిల్ 30న యూటర్న్ తీసుకుంటూ దీనికి ఆమోదం తెలిపిందని ఆయన విమర్శించారు.

జనగణనలో ఫేజ్ 1 ఏప్రిల్-సెప్టెంబర్ 2026లో జరగనుంది, ఇందులో గృహ సామగ్రి, యాజమాన్యం, గృహ సౌకర్యాలు, వాహనాలు, తృణధాన్యాల వినియోగం మరియు మరిన్నింటిపై 33 ప్రశ్నలు ఉంటాయి. ఫేజ్ 2 (జనాభా గణన) సెప్టెంబర్ 2026లో ఎంపిక చేసిన ప్రాంతాలకు, ఫిబ్రవరి 2027లో దేశవ్యాప్తంగా కుల డేటాను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంగ్రహిస్తారు.

వాస్తవానికి 2021 జరగాల్సిన జనగణన…COVID-19 కారణంగా వాయిదా పడింది. కాగా, రూ. 11,718 కోట్లతో భారీ బడ్జెట్‌తో ప్రస్తుతం జనాభా లెక్కలను చేపట్టనున్నారు. ఈసారి మొబైల్ యాప్‌లను ఉపయోగించి భారతదేశంలో మొట్టమొదటిసారి డిజిటల్ పద్ధతిలో జనగణన చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక-సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి విద్య, ఉపాధి, ఆదాయం, రాజకీయ భాగస్వామ్యంపై సమగ్ర కుల వారీ డేటాకు నమూనాగా తెలంగాణ 2025 SEEEPC సర్వేను కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్ ప్రశంసించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.