హైదరాబాద్: గంజాయి, ఇతర నిషేధిత డ్రగ్స్ పంపిణీ చేయడానికి ఈ-కామర్స్,కొరియర్ సేవలను దుర్వినియోగం చేయవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటివారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటారని చెప్పారు.
బషీర్‌బాగ్‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫుడ్ డెలివరీ యాప్‌లు, కొరియర్ సంస్థలు, రవాణా అగ్రిగేటర్ల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించిన సజ్జనార్… పోలీసుల ప్రశ్నలకు వెంటనే స్పందించడానికి వారి సంస్థలలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి కఠినమైన నిఘా విధానాలను అమలు చేయాలని ఆయన అన్ని సంస్థలను కోరారు. అనుమానాస్పద పార్శిల్లను గుర్తించిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్లు…పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు దోహదపడే ఏదైనా సంస్థ కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటుందని సజ్జనార్ అన్నారు.
మహిళా ప్రయాణికుల నుండి వచ్చే వేధింపుల ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణించారు. అలాంటి సంఘటనలను నివారించడానికి రవాణా సంస్థలు తమ డ్రైవర్లను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
అంతేకాదు, యాప్‌లలో లొకేషన్ చూసాక తర్వాత రైడ్లను రద్దు చేసుకునే క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన అగ్రిగేటర్లను కోరారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని సీపీ సజ్జన్నార్ రవాణా సంస్థలకు సూచించారు.


