హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన ఫిబ్రవరి 3న ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనతో తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
అనంతరం, ముఖ్యమంత్రి ఫిబ్రవరి 4న జగిత్యాల సమావేశంలో, ఫిబ్రవరి 5న రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో, ఫిబ్రవరి 6న భూపాలపల్లిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత, ముఖ్యమంత్రి ఫిబ్రవరి 7న మెదక్‌లో, ఫిబ్రవరి 8న నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.
కాగాచ ముఖ్యమంత్రి ఫిబ్రవరి 2న అమెరికా నుండి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ప్రస్తుతం సీఎం మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన జనవరి 30 వరకు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లోనే ఉంటారు.
అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ… మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రచార సరళిని సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించినట్టుగా తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రుల నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీలు, ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల ఆధారంగా మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు గెలుపు అవకాశాలతో పాటు, సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, నిజాయితీ, క్రమశిక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్క్రీనింగ్ కమిటీలకు నాయకత్వం వహిస్తున్న మంత్రులకు రేవంత్ సూచించారు.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రామగుండం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మంచిర్యాల వంటి నగర పాలక సంస్థల పరిధిలో కార్నర్ మీటింగులు, రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలతో నేరుగా సమావేశమై సమస్యలు తెలుసుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.


