జెరూసలెం: గత ఏడాది అక్టోబర్ 10న గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, కాల్పుల విరమణ తర్వాత ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం.
హమాస్ కొత్త కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, గాజా అంతటా దాడులు జరిగాయి, వాటిలో గాజా నగరంలోని ఒక అపార్ట్మెంట్ భవనం, ఖాన్ యూనిస్‌లోని ఒక టెంట్ క్యాంప్‌పై ప్రాణాంతకమైన దాడులు కూడా ఉన్నాయని మృతదేహాలను అందుకున్న ఆసుపత్రుల అధికారులు తెలిపారు. మృతుల్లో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. గాజా నగరంలోని ఒక పోలీస్ స్టేషన్‌ను కూడా వైమానిక దాడి చేశారు, కనీసం 14 మంది మరణించారు, ఇతరులు గాయపడ్డారని షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబు సెల్మియా తెలిపారు.
టెంట్ క్యాంప్‌పై జరిగిన దాడిలో మంటలు చెలరేగాయని, తండ్రి, అతని ముగ్గురు పిల్లలు,ముగ్గురు మనవరాళ్ళు సహా ఏడుగురు మరణించారని నాజర్ హాస్పిటల్ తెలిపింది. ఇర గాజా సిటీ అపార్ట్మెంట్ భవనంపై జరిగిన దాడిలో ముగ్గురు పిల్లలు, వారి అత్త, అమ్మమ్మ మరణించారని, పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలో నలుగురు మహిళా పోలీసులు సహా కనీసం 14 మంది అధికారులు,స్టేషన్లో నిర్బంధించినన ఖైదీలు మరణించారని షిఫా హాస్పిటల్ తెలిపింది. ఈ దాడిలో పాలస్తీనా పౌరులు కూడా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను హమాస్ “తీవ్ర ఉల్లంఘన” అని అభివర్ణించింది. దాడులను ఆపడానికి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా, ఇతర మధ్యవర్తిత్వ దేశాలను కోరింది. అయితే అక్టోబర్ నుండి తాము జరిపిన దాడులు ఒప్పంద ఉల్లంఘనలకు ప్రతిస్పందన అని ఇజ్రాయెల్ పేర్కొంది.
అక్టోబర్ 10న కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ కాల్పుల్లో 509 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నమోదు చేసింది. హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగమైన మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి సంస్థలు, స్వతంత్ర నిపుణులచే సాధారణంగా నమ్మదగ్గవిగా పరిగణించే వివరణాత్మక మరణాల రికార్డులను నిర్వహిస్తుంది.
కాగా, ఈజిప్టు సరిహద్దు వెంబడి ఉన్న రఫా క్రాసింగ్‌ను తెరవడానికి ఒక రోజు ముందు కూడా ఈ వరుస దాడులు జరిగాయి. ఇక యుద్ధం కారణంగా పాలస్తీనా భూభాగంలోని అన్ని సరిహద్దు క్రాసింగ్‌లు మూసివేసిన సంగతి తెలిసిందే. రఫా క్రాసింగ్‌ను వేలాది మంది పాలస్తీనియన్లు జీవనాధారంగా చూస్తున్నారు.
అమెరికా మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ రెండవ దశలో… మూసి ఉన్న ఈ క్రాసింగ్ తెరవడం, కీలక అడుగుగా భావిస్తున్నారు. సరిహద్దులను తిరిగి తెరవడం అనేది ప్రస్తుతం జరుగుతున్న దశలోని సవాలుతో కూడిన అంశాలలో ఒకటి, ఇందులో దాదాపు రెండు దశాబ్దాల హమాస్ పాలన తర్వాత స్ట్రిప్‌ను సైనికీకరించకుండా చేయడం, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఉన్నాయి.
మొత్తంగా కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు… గాజాలో మరణాలు ఇంకా పెరుగుతున్నాయని గుర్తు చేస్తోంది.


