డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ హిందూ జిమ్ యజమాని, హిందూ అతివాద సంస్థ బజరంగ్ దళ్ సభ్యులతో కూడిన ఓ గుంపు నుండి … ముస్లిం దుకాణదారుడిని రక్షించినందుకు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన వీడియోలో రికార్డ్ అయింది. అప్పటి నుండి ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది.
“నేను హిందువును కాదు, ముస్లింను కాదు, సిక్కును కాదు, క్రైస్తవుడిని కాదు. అన్నింటికన్నా ముందు నేను ఒక మనిషిని. చనిపోయిన తర్వాత నేను జవాబు చెప్పాల్సింది దేవుడికి, మానవత్వానికి తప్ప మతానికి కాదు” అని ఆ జిమ్ యజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ సంఘటనకు కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి.. 46 ఏళ్ల జిమ్ యజమాని దీపక్ కుమార్. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న వైఖరి, ఆ తర్వాత ఎదురైన పరిణామాలు… ఇవన్నీ ఇప్పుడు సోషల్‌మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి.
ఈ సంఘటన జనవరి 26న ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్ పట్టణంలో జరిగింది. ఆ సమయంలో కుమార్ తన స్నేహితుడి దుకాణంలో ఉన్నప్పుడు, 70 ఏళ్ల ముస్లిం దుకాణదారుడు వకీల్ అహ్మద్‌ను ఒక బృందం బెదిరించడాన్ని చూశారు. తమను బజ్రంగ్ దళ్ సభ్యులమని చెప్పుకున్న ఆ వ్యక్తులు, అహ్మద్ దుకాణం పేరు ‘బాబా స్కూల్ డ్రెస్’లోని ‘బాబా’ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ పదం హిందూ మత పెద్దలకు మాత్రమే చెందిందని వారు వాదించారు. పేరు మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
ఈ దృశ్యాన్ని చూసి దీపక్ అక్కడే జోక్యం చేసుకున్నారు. “ఈ దుకాణం 30 ఏళ్ల నాటిది; మీరు పేరు మారుస్తారా?” అని అతను ఆ గుంపును ప్రశ్నించారు. వారిలో ఒకరు అతని పేరేమిటని అడగ్గా… “నా పేరు మహమ్మద్ దీపక్!” అని సమాధానం ఇస్తాడు. ఈ మాటలు అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచాయి. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది.
కొందరికి అది ధైర్యంగా అనిపించగా, మరికొందరికి ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యాఖ్య వెనుక ఉద్దేశాన్ని దీపక్ తర్వాత స్పష్టం చేశారు. “నేను.. మతాల కలయికను, భారతీయ గుర్తింపును చూపించాలనుకున్నాను. చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశం ఇవ్వడమే నా ఉద్దేశం” అని ఆయన ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పాడు.
కాగా, ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యాక…దీపక్‌ను X, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో మితవాద సోషల్ మీడియా వినియోగదారులు లక్ష్యంగా చేసుకున్నారు, అతని పబ్లిక్ ప్రొఫైల్స్‌లో దూషించే వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు అతని వైఖరికి మద్దతు, కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, దీపక్ ఇంటి ముందు, జిమ్ బయట గుంపులు గుమిగూడటంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. నిరసనకారులు అతను బయటకు రావాలని డిమాండ్ చేస్తూ, ముస్లింలకు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించడం వినిపించింది.
దీనికి ప్రతిస్పందనగా, దీపక్ తన వైఖరిని సమర్థిస్తూ, మత విభజనను తిరస్కరిస్తూ వీడియోలను పోస్ట్ చేశాడు. “నా సోదరులు, సోదరీమణులు,స్నేహితులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, మన దేశానికి ద్వేషం కాదు, ప్రేమ, ఆప్యాయత అవసరం. మీరు ఎంత ద్వేషాన్ని అయినా వ్యాప్తి చేయవచ్చు; దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. కానీ ప్రేమను పంచడం అనేది చాలా గొప్ప విషయం,” అని అతను తన వీడియోలో చెప్పాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఒకటి దుకాణదారుడిని బెదిరించారనే ఆరోపణల ఆధారంగా కాగా, రెండవది మత విద్వేషాలను రెచ్చగొట్టడం, జాతీయ రహదారిని దిగ్బంధించడం, పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు 30 నుండి 40 మంది గుర్తు తెలియని వ్యక్తులపై నమోదు చేశారు.
దీపక్ కుమార్ వ్యాఖ్యల ఇన్స్టాగ్రామ్ లింక్
https://www.instagram.com/reel/DUGBkrKD2eJ/?utm_source=ig_web_button_share_sheet


