న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగగా… మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి ఆరుసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇప్పటికీ ఎలాంటి సమాధానం లేదని చెప్పారు. తనకు న్యాయం జరగలేదని అన్నారు. తన రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయడం లేదని, ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.
“ఎన్నికల సంఘం బెంగాల్ ప్రజలను బుల్డోజ్ చేస్తోంది. ఎస్‌ఐఆర్ మొదటి దశలో ఈసీఐ 56 లక్షల ఓటర్లను తొలగించింది. వారికి ఫారం 6 సమర్పించే అవకాశం లభించలేదు. వారు కేవలం బెంగాల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని నా వాదన. వారు కేవలం బెంగాల్‌లో మాత్రమే మైక్రో-అబ్జర్వర్‌లను నియమించారని” ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కింద ఓటర్ల జాబితా ప్రక్షాళనను ప్రస్తావిస్తూ ఆమె ఆరోపించారు.
కాగా, మమతా బెనర్జీ వాదనలపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మమతా బెనర్జీ అభ్యర్థన నిజమైనదని అంగీకరించి… ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి సీజేఐ ధర్మాసనం నోటీసు జారీ చేసింది. ఎస్‌ఐఆర్ నోటీసులు పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది.
మొత్తంగా సుప్రీంకోర్టులో ఎనిమిది నిమిషాల పాటు సాగిన ఈ వాదనపై పశ్చిమ బెంగాల్‌లోని రాజకీయ పరిశీలకులు నిశితంగా దృష్టి సారించారు. రాజకీయ ప్రదర్శన పరంగా బెనర్జీ రాజకీయంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటం అంత సులభం కాకపోవచ్చు.
“మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి కోర్టు గదిలో నిలబడ్డారు, ఆమె రాజకీయంగా మంచి మార్కులు సాధించి ప్రచారంలో ముందంజ వేశారు. కానీ ఈ SIR సమస్య మాత్రమే ఆమె ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటమైతే, అది కాలమే నిర్ణయిస్తుంది, ఎందుకంటే బెంగాల్‌లో ప్రతిపక్షాలు నిరుద్యోగం, మహిళల భద్రత, అభివృద్ధి, పాలన వంటి సమస్యలను లేవనెత్తుతూనే ఉన్నాయని” రాజకీయ విశ్లేషకుడు ఎస్. భట్టాచార్య ఎన్‌డిటివితో అన్నారు.


