గువహటి: బెంగాలీ ముస్లింలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమర్థించుకున్నారు. ఈమేరకు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన సూత్రాలను ఉదహరించారు.
जानिए कैसे असम के लोग पूज्य बापू की Non Cooperation और Civil Disobedience की विचारधारा को अपनाकर राज्य को घुसपैठिया-मुक्त बना सकते हैं। pic.twitter.com/TJgXb4IZDq
— Himanta Biswa Sarma (@himantabiswa) February 4, 2026
శివసాగర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అస్సాం సీఎం శర్మ మాట్లాడుతూ…బెంగాలీ ముస్లింలు “అస్సాంలో ఉండలేని” పరిస్థితులను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రం ప్రతిరోజూ “20 లేదా 30” మందిని బహిష్కరిస్తున్నప్పటికీ, సామూహిక బహిష్కరణ సాధ్యం కాదని ఆయన వివరించారు. దానికి బదులుగా, వారికి భూమి, వాహనాలు, రిక్షాలు, తోపుడు బండ్లను లాక్కొని… వారు స్వచ్ఛందంగా వెళ్లిపోయేలా చేయాలని ఆయన సూచించారు.
అక్రమణల తొలగింపు చర్యల ద్వారా 1.5 లక్షల బిఘాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, ప్రతిరోజూ 20-25 మందిని “వెనక్కి పంపిస్తున్నామని” శర్మ పేర్కొన్నారు. “ఎవరూ కోర్టుకు వెళ్లే ధైర్యం చేయడం లేదు” అని కూడా ఆయన అన్నారు.
తన విధానాన్ని గాంధేయవాదంగా అభివర్ణిస్తూ… అస్సామీ పౌరులు కూడా ఇలాంటి చర్యలనే అనుసరించాలని, “మియాలు”, ఇతర ముస్లింల మధ్య తేడాను గుర్తించాలని ఆయన కోరారు: “మియా, ముస్లిం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. మియా పేరుతో ముస్లింలను వేధించవద్దు; ముస్లింల పేరుతో మియాలకు రక్షణ కల్పించవద్దు.”
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరుగుతున్న రాజకీయ వేడి మధ్య చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ విద్వేషపూరిత ప్రసంగంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, జమియత్ ఉలేమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించి, శర్మ ప్రకటనలు మతతత్వ, రాజ్యాంగ విరుద్ధమైనవని, మైనారిటీల హక్కులకు ముప్పు అని వాదించింది.
అదే రోజు, అస్సాం కాంగ్రెస్ “హెచ్‌బిఎస్ ఎవరు?” అనే పేరుతో ఒక ప్రతి ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 12,000 బిఘాల భూమిని శర్మ, అతని కుటుంబం అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఏఐసిసి నాయకుడు జితేంద్ర సింగ్ “హెచ్‌బిఎస్ ఎవరు?” అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి ఒక వెబ్‌సైట్‌ను కూడా ఓపెన్‌చేశారు. శర్మ వెంటనే స్పందించి, గొగోయ్, సింగ్, బాగెల్, దేబబ్రత సైకియాపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం చర్యలను ప్రకటించారు.
బెంగాలీ సంతతికి చెందిన ముస్లింలు అస్సాంలోని అత్యంత అణగారిన వర్గాలలో ఉన్నారు. అక్రమ వలసదారులు అనే అపవాదు వారిపై ఉంది. కాగా, ఓటర్ల జాబితా సవరణల సమయంలో ప్రజలను “ఇబ్బంది పెట్టమని”, రిక్షా ఛార్జీలకు తక్కువ చెల్లించమని అస్సాం సీఎం వ్యాఖ్యానించడం మత ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందని, రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తుందని విమర్శకులు అంటున్నారు.

