జైపూర్: రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి లింగవివక్ష వ్యాఖ్యలు చేయడంతో రాజస్థాన్ అసెంబ్లీలో రాజకీయ వివాదం చెలరేగింది. బిజెపి ప్రభుత్వ బడ్జెట్‌ను “అబ్బాయి జననం” తో, గత కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌ను “అమ్మాయి జననం” తో పోల్చారు.
బడ్జెట్ చర్చలో పాల్గొన్న వీర్ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం “యువ బడ్జెట్” ను సమర్పించిందని, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు “వృద్ధాప్య బడ్జెట్” ను సమర్పించిందని అన్నారు.
“మా మొదటి బడ్జెట్ వచ్చినప్పుడు, రాజస్థాన్ మొత్తం దానిని ప్రశంసించింది. రెండవ బడ్జెట్ వచ్చింది, దానిని కూడా స్వాగతించారు. మూడవ బడ్జెట్‌ను కూడా స్వాగతించారు” అని కోలి అన్నారు. “మా భజన్ లాల్ శర్మ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో ఒక కొడుకుకు జన్మనిచ్చింది., రెండవ బడ్జెట్లో కూడా కొడుకే పుట్టాడు. మూడవ బడ్జెట్లో కూడా కొడుకుకు జన్మనిచ్చారు. తన యవ్వనంలో కొడుకుకు జన్మనిచ్చేవాడు ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటాడని సదరు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.”
గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, “అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశబెట్టిన బడ్జెట్‌ను అమ్మాయి జననంతో పోల్చారు. కుమారుడు పుట్టలేదని ఎద్దేవా చేశారు. అందుకే మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు” అని ఆయన అన్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల సమయంలో అనేక మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు నవ్వుతూ కనిపించారు. ఆ సమయంలో స్పీకర్ అభ్యంతరం చెప్పలేదు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
కాగా, రాజస్థాన్ ప్రతిపక్ష నాయకుడు టికా రామ్ జుల్లీ ఈ ప్రకటనను విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివక్షతతో కూడినవని, అనుచితమని అన్నారు. “ఫిబ్రవరి 16న, మీ ఎమ్మెల్యే బడ్జెట్‌పై మాట్లాడుతూ, కొడుకు, కూతురు మధ్య వివక్ష చూపే వ్యాఖ్యలు చేశారు. మీ ఎమ్మెల్యేలు నవ్వుతున్నారు. నేటికీ అలాంటి ఆలోచన కొనసాగుతుండటం సిగ్గుచేటు” అని జుల్లీ అన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఇటీవల వారిలో ఒకరి వివాహం కూడా అయిందని, కుమార్తెల గురించి అలాంటి అభిప్రాయాలు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.
లింగ వివక్ష విషయంలో పాలక పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని జుల్లీ డిమాండ్ చేశారు. బడ్జెట్ చర్చలో లింగ ఆధారిత సారూప్యతలకు స్థానం లేదని అన్నారు.
తరువాత, తన వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ ఎమ్మెల్యే కోలి విలేకరులతో మాట్లాడుతూ… “ఇందులో తప్పేంటి? ఇది మన బ్రిజ్‌భాష” అని అన్నారు. ఆయన ప్రకటన సరికాదా అని అడిగినప్పుడు, “క్యా బయాన్ గలత్ థా? మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని నేను చెప్పాను; ఒక చోరా (అబ్బాయి) పుట్టాడని” అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు “ప్రజలను మోసం చేయడానికి” ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, దానిని ఆడపిల్ల జననంతో పోల్చానని ఆయన బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
