ముంబయి: రానున్న ఐదేళ్లలో తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉండవని, గ్రామీణ ప్రాంతాలకు లేదా హైదరాబాద్ శివార్లలోకి మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ (2026) సదస్సులో సీఎం కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథాన్ని వివరించారు, ఆర్థిక వృద్ధిని పర్యావరణ స్థిరత్వంతో అనుసంధానించారు.
ఆర్థిక వ్యవస్థ లేదా కరెన్సీ విలువ విద్యుత్, ఇంధన వినియోగానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని నొక్కి చెప్పారు. 2030 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
“తెలంగాణ ప్రస్తుతం రోజుకు సగటున 16,610 మెగావాట్లను వినియోగిస్తోంది. గత సంవత్సరం నమోదైన గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు, ఈ సంవత్సరం 19,000 మెగావాట్లను మించిపోతుందని అంచనా వేశాం. 2034 నాటికి 34,000 మెగావాట్లను దాటుతుందని అంచనా. రాష్ట్ర ఇంధన శక్తిలో దాదాపు పావు వంతు అంటే 25 శాతం గ్రీన్ పవర్ నుండి లభిస్తోంది, ”అని ఆయన అన్నారు.
పట్టణభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్ (CURE)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు.
CURE, PURE, RARE మూడు జోన్లు
రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్‌ను 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా ప్రకటించగా, ORR, 360 కి.మీ.ల రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని PURE జోన్‌గా రూపొందించి తయారీ రంగానికి నిర్దేశించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ CURE ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా EVల స్వీకరణ పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. దీని ఫలితంగా “200,000 కంటే ఎక్కువ ఆటోరిక్షాలు గ్రీన్ ప్రత్యామ్నాయాల వైపు మారుతున్నాయి, 3,500 కంటే ఎక్కువ TGSRTC బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోను 71 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తున్నారు” అని ఆయన అన్నారు.
“పర్యావరణపరంగా ఉపయోగించే ప్రతి యూనిట్ విద్యుత్ రాష్ట్రం, దేశం, భూ గ్రహానికి ప్రయోజనం చేకూరుస్తుంది, గ్రీన్ ఎనర్జీతో నడిచే తయారీ విప్లవం అవసరాన్ని నొక్కి చెబుతుంది” అని ఆయన ముగించారు.
