వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలను ఆదేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై తాత్కాలికంగా 10% టారిఫ్ అమలు చేస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది. ఈమేరకు ఫిబ్రవరి 24 నుండి 150 రోజుల పాటు ఈ సుంకాలు అమలులో ఉంటాయి.
పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు… చట్టవిరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ విధించిన టారిఫ్లను కొట్టివేసింది.
రిపబ్లికన్ అధ్యక్షుడి తీరు 1977 చట్ట (ఐఈఈపీఏ- ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) అధికార పరిధిని మించిపోయిందని పేర్కొంది. విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ట్రంప్ చాలా దేశాలపై సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అధిగమించారని అమెరికా సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
కాగా, సుప్రీం కోర్టు తీర్పు అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరం. ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నా. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైనట్లుంది. ఈ కోర్టులను ఏదో ఒకటి చేయాలి. వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదు. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) లోని సెక్షన్ 122ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానని అన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సుంకాలు 150 రోజుల పాటు అమల్లోకి అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో భారత్తో కుదిరిన ఒప్పందం ఏమీ మారదని ట్రంప్ తేల్చి చెప్పారు. వారు సుంకాలు చెల్లిస్తారు, మరియు మేము సుంకాలు చెల్లించము అంతేనని అన్నారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్లో దేశ వాణిజ్య లోటును ఒక జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. 1977 నాటి ‘అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈఈపీఏ) కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి దాదాపు కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా చైనా, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వస్తువులపై డ్రగ్ ట్రాఫికింగ్, సరిహద్దు సమస్యలను సాకుగా చూపి అదనపు పన్నులు వేశారు.

